Feb 21,2023 23:52

యూనియన్‌ బ్యాంకు ముందు నిరీక్షిస్తున్న ఖాతాదారులు

ప్రజశక్తి-రాజవొమ్మంగి
మండలంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ సిగల్‌ లేకపోవడంతో స్థానిక యూనియన్‌ బ్యాంక్‌ సేవలు మంగళవారం నిలిచిపోయాయి. దీంతో బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోని జడ్డంగి నుండి కాకరపాడు వరకు నేషనల్‌ హైవే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. హైవే నిర్మాణ పనుల్లో భాగంగా బిఎస్‌ఎన్‌ఎల్‌ అండర్‌ గ్రౌండ్‌ కేబుల్స్‌ తెగిపోవడంతో తరచూ బిఎస్‌ఎన్‌ఎల్‌ సిగల్‌కు అంతరాయం ఏర్పడుతుంది. బ్యాంకు సేవలతో పాటు, ప్రభుత్వ కార్యాలయ సేవలు కూడా నిలిచిపోతున్నాయి. దీంతో మండల వాసులు ఆయా ప్రభుత్వ కార్యాలయ పనుల కోసం మండల కేంద్రానికి వచ్చి పనులు జరగకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుతిరగాల్సి వస్తుంది. మండలంలోని 19 పంచాయితీలు ఉండగా సుమారు 35 వేల జనాభా ఉన్నారు, వీరందరికీ మేజర్‌ పంచాయతీ అయిన రాజవొమ్మంగిలో ప్రధాన కార్యాలయాలు ఉండడంతో నిరంతరం రాజవొమ్మంగి గ్రామానికి వేలాది మంది ప్రజలు వస్తూ పోతూ ఉంటారు. అందులో ప్రధానంగా యూనియన్‌ బ్యాంక్‌ ఒకటి. ఈ బ్యాంకులో వేలాది మందికి ఖాతాలు ఉండగా, ప్రతిరోజు 200 మంది ఖాతాదారులు వస్తుండగా, రూ 50 లక్షల వరకు బ్యాంకు ద్వారా వివిధ లావాదేవీలు జరుగుతుంటాయి. మంగళవారం బిఎస్‌ఎన్‌ఎల్‌ సిగల్స్‌ లిచిపోవడంతో ఉదయం 11 గంటల నుండి ఈ బ్యాంకు ద్వారా ఎటువంటి లావాదేవీలు జరగలేదు. దీంతో ఎక్కువగా డబ్బులు అవసరం ఉన్న ఖాతాదారులు, డ్వాక్రా మహిళలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు నిర్మాణ పనుల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌ కేబుల్స్‌ కట్‌ అవడంతో వాటిని 24 గంటల లోపల సిబ్బంది సరి చేయాల్సి ఉంది. సిబ్బంది రాజవొమ్మంగి రావాలంటే సుమారు 100 కిలో మీటర్లు దూరం ఉన్నా కాకినాడ నుండి ఇక్కడికి రావాల్సి వస్తుంది. దీంతో తీవ్ర జాప్యం జరగడం వల్ల యూనియన్‌ బ్యాంకుకు వేరే నెట్‌ వర్క్‌ అవకాశం లేకపోవడంతో వివిధ సర్వీసులకు వచ్చే బ్యాంక్‌ ఖాతాదారులు బ్యాంకు వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఏటీఎం కూడా సక్రమంగా పనిచేయకపోవడంతో డబ్బులు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు కోసం ఖాతాదారులు ప్రైవేటు ఏటీఎంల వద్ద క్యూకడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్‌ ఏటీఎం నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు కూడా అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి బ్యాంకు సేవలు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.