Oct 13,2023 19:23

ఎమ్మెల్యేకు బాటిళ్లలో శుద్ధ జలం చూపిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌

నెరవేరనున్న పట్టణ నిరుపేదల సొంతింటి కల
- 18న టిడ్కో గృహాలు ప్రారంభం
- హాజరు కానున్న ప్రముఖులు
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ

         ఆళ్లగడ్డ పట్టణంలోని నిరు పేదల సొంతింటి కల సాకారం కానుంది.. 1392 గృహాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఆళ్లగడ్డ పట్టణ శివార్లలో నూతనంగా నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను ఈ నెల 18న ప్రారంభించేందుకు పలువురు ప్రముఖులు రానున్నారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ భాష, పురపాలక శాఖ మాత్యులు ఆదిమూలపు సురేష్‌, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహా మండలి సభ్యులు గంగుల ప్రభాకర్‌ రెడ్డి, శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ తదితర అధికారులు రానున్నారు.
ఎమ్మెల్యేను కలిసిన టిడ్కో ఎస్‌ఇ :
పట్టణంలో ఈ నెల 18న టిడ్కో గృహాలను ప్రారంభించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా అక్కడ చేరే లబ్ధిదారులకు నీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని శుద్ధ జలాన్ని అందిస్తామని అధికారులు చెప్పారు. ఇందులో భాగంగా టిడ్కో ఎస్‌ఈ రాజశేఖర్‌, కమిషనర్‌ రమేష్‌ బాబు శుక్రవారం ఎమ్మెల్యే గంగుల నానిని కలిసి టిడ్కో గృహాలకు సరఫరా చేసే నీటిని చూపించారు. చింతకుంట్ల చెరువు నుండి నీటిని శుద్ధి చేసి తర్వాత క్లోరిరేషన్‌ చేసి అందజేస్తామని వారు తెలిపారు. శుద్ధి చేయకముందు ఉన్న నీటిని, శుద్ధి చేశాక వచ్చిన నీటిని బాటిల్లో నింపి ఎమ్మెల్యేకు చూపించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఏఈ సురేంద్రారెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం టిడ్కో ఎస్‌ఇ, కమిషనర్‌లు టిడ్కో గృహ సముదాయాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.