Aug 06,2023 21:53

పొలాల్లో ఏర్పాటు చేసిన పైపులైన్లు

ప్రజాశక్తి - వీరఘట్టం : అనేక ఏళ్లుగా వరుణునిపై ఆశలు పెట్టుకొని పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి ఉండేది. తమ ప్రాంతంలో సాగునీటి వసతి ఎప్పుడు వస్తాదనని ఈ ప్రాంత గిరిజనులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వారి కల నెరవేర్చందుకు హైదరాబాద్‌కు చెందిన వాసన్‌ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ పైప్లైన్‌ ద్వారా సాగునీరందించేందుకు ఆర్థిక సాయం అందిస్తామనడంతో గిరిజన రైతుల్లో అంతులేని ఆనందం నెలకొంది.
మండలంలో చినగోరకాలనీ సచివాలయం పరిధిలోని మామిడిమానుగోర, చినగోర, కొండవానిగోర గిరిజన గ్రామాల్లో సుమారు వందెకరాలు 57 మంది గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా వర్షం పైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నట్లు రైతులు పత్తిక కామేశ్వరరావు, బిడ్డిక సోమిబాబు, నిమ్మక రమేష్‌, కొండగొర్రె శంకర్రావు, రమణయ్య, ఆరిక త్రినాధరావు, వి.భాస్కరరావు, బిడ్డిక సింహాచలం, ఆదినారాయణ, తదితరులు తెలిపారు. అయితే వర్షాలపై ఆధారపడకుండా పైపులైన్‌ ద్వారా పంటలు సాగు చేసుకోవచ్చని, వీటికి ఖర్చు తమ సంస్థ భరించుకుంటుందని వాసన్‌ సంస్థ మండల కోఆర్డినేటర్‌ కె.రవికుమార్‌ తెలిపారు. ఇటీవల ఈ గ్రామాల్లో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఈ మూడు గిరిజన గ్రామాల రైతన్నలతో చర్చించారు. ప్రతి ఏటా వర్షాలపైన ఆధారపడి పంటలు సాగు చేస్తున్నామని, తమకు ఆ అవకాశాన్ని కల్పించాలని రైతులు కోరారు. ఈ మేరకు ఆయన ఈ సమస్యను సంస్థ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఆర్థిక సాయంతో రూ.30 లక్షల అంచనా వ్యయంతో 10ఎంఎంహెచ్‌పి రెండు మోటార్లతో పైపులైన్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. 75శాతం బ్యాంకు భరించుకుంటుందని, 25శాతం రైతులు భరించుకోవాలని పథకం లక్ష్యమని మండల కోఆర్డినేటర్‌ చెబుతున్నారు. ఈ లెక్కను చూస్తే రూ.22.05 లక్షలు సంస్థ భరించుకుంటుందని, రూ 7.5 లక్షలు రైతులు భరించుకోవాలని గిరిజన రైతులు చెబుతున్నారు.
అపన్న హస్తం కోసం ఎదురుచూపు
పంట భూములకు సాగునీరందించేందుకు వీలుగా గ్రామాలకు సమీపంలోని గెడ్డల్లో వస్తున్న నీటిని నిల్వచేసి అక్కడ రెండు 10 ఎంఎం హెచ్‌పిలు గల సోలార్‌ సిస్టంతో పైప్‌ లైన్‌ ద్వారా సాగు నీరందించాల్సి ఉంది. ఈ మోటర్లు కొనుగోలు చేసేందుకు ఆర్థికంగా వెనుకబడి ఉన్న నందున సహాయం కోసం గిరిజను రైతులు ఎదురుచూస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కా నిండిన తమ పరిస్థితిని, ఈ పరిస్థితుల్లో ఇంత డబ్బు ఎలా వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు మోటార్లకు గానూ ఒకటి సంస్థ ఏర్పాటు చేసి పైపులైన్‌ ద్వారా సాగునీరు ట్రయల్‌ రన్‌ విడిచిపెట్టారు. పైపుల ద్వారా బీడు భూములకు నీరు రావడంతో గిరిజన రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తే మరో మోటర్‌ను కొనుగోలు చేసి ఏడాదికి రెండు పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉందని గిరిజన రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి 25శాతం వసూలు చేసింది ఏమైనా సమస్య ఏర్పడినప్పుడు వాటికి ఉపయోగించేందుకు దోహదపడుతుందని మండల కోఆర్డినేటర్‌ చెబుతున్నారు. ఏర్పాటు చేసిన పరికరాలకు పైసా కూడా రైతన్నలు కట్టనవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
కష్టాలు తప్పనున్నాయి
ప్రతి ఏటా వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌కు చెందిన వాసన్‌ సంస్థ కొంతమేర ఆర్థిక సహాయంతో పంట పొలాలకు పైప్‌ లైన్‌ ఏర్పాటు చేయడంతో చెప్పలేని ఆనందం. బీడు భూములు పంట భూములుగా తయారవుతుందని ఊహించలేదు. ప్రస్తుతం పైప్లైన్‌ ద్వారా సాగునీరు రావడంతో సాగునీటి కష్టాలు తప్పనున్నాయి.
పత్తిక కామేశ్వరరావు
రైతు, చినగోరకాలనీ.

అపన్న హస్తం కోసం ఎదురుచూపు
ఇప్పటికే వాసన్‌ సంస్థ 75శాతం ఆర్థిక సహాయంతో కొంతమేర పనులు పూర్తి కావచ్చాయి. మిగిలిన 25శాతం రైతులు ఎకరాకి ఎనిమిది వేల రూపాయలు పోగు చేయాల్సి ఉన్నప్పటికీ నిరుపేదలమైన రైతులు కావడంతో ఆర్థిక సాయం చేసేందుకు అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాం. ఆర్థిక సహాయం చేసే వారు ముందుకొచ్చి తమ ఆశలు నెరవేర్చాలని కోరుతున్నాం.
ఆరిక త్రినాధరావు,
రైతు, మామిడి మానుగోర.