Nov 21,2023 21:27

పాలకొండ : తుండరాడలో ఇంటింటి కుళాయిలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి - పాలకొండ: జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమం కింద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటింటికి మంచి నీటి కుళాయిలు ద్వారా తాగునీరందించి ప్రజల కల నెరవేర్చనుందని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. గరుగుబిల్లి మండలం దత్తివలస, వీరఘట్టం మండలం విక్రాంపురం, నడుకూరు, టికె పురం, పాలకొండ మండలం తుమరాడ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి జలజీవన్‌ మిషన్‌ పనులను మంగళవారం పరిశీలించారు. గ్రామంలో ఇప్పటి వరకు లక్ష్యం మేరకు ఏర్పాటు చేసిన మంచినీటి కొళాయిలు, పూర్తికావాల్సిన పనుల వివరాలను ఆర్డబ్ల్యూస్‌ ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ట్యాంక్‌ నింపే నీటి సౌలభ్యం, సంపు నుండి పైప్‌లైన్ల ద్వారా నీటి సరఫరా పరిశీలించారు. మంచినీటి కుళాయిలకు ఏర్పాటు చేసిన ట్యాప్‌ల నాణ్యతను తనిఖీ చేశారు. నడుకూరు కాలనీలోని శివారు ప్రాంతం వరకు ఇంటింటికీ వెళ్లి కుళాయిలు నుంచి సరఫరా అవుతున్న మంచినీటి ప్రవాహం, సామర్థ్యాన్ని పరిశీలించారు. ఇంటింటికీ మంచినీటి కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా ఎలా ఉందని, ఇబ్బందులు ఏమైనా ఉన్నయా అని మహిళలకు కలెక్టర్‌ ప్రశ్నించగా తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేయడం వల్ల ఆ సమస్యలు తీరాయని, అవసరాల మేరకు తాగునీరు అందుతుందని బదులివ్వడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. టి కె రాజపురంలో నిర్మాణంలో ఉన్న 40 వేల లీటర్ల సామర్థ్యం గల ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ పనులను పరిశీలించి డిసెంబర్‌ లోగా పనులను పూర్తి చేసి గుత్తేదారు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనుల్లో నాణ్యతాపరంగా లోపం లేకుండా ఇంజనీరింగ్‌ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. విక్రంపురంలోని హెచ్‌డిపిఇ పైప్‌ లైన్‌ పనులను పరిశీలించి వారం రోజుల్లోగా పైప్‌ లైన్లు ఏర్పాటు చేసి ఇంటింటికి కుళాయి కనెక్షన్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏ ఒక్క మంచినీటి కొళాయి పెండింగ్‌ ఉండకుండా పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రణాళికా బద్ధంగా పనిచేసి ఇంటింటికి కుళాయిలను అమర్చాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కలెక్టర్‌ వెంట ఆర్‌డబ్ల్యుఎస్‌ జిల్లా అధికారి ఒ.ప్రభాకరరావు, డిఇ పి.ఢిల్లేశ్వరరావు, పాలకొండ, వీర ఘట్టం ఎఇలు కెవిఎన్‌సి ప్రవల్లిక, పవన్‌ కుమార్‌, ఇంజనీరింగ్‌ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.