ప్రజాశక్తి-అచ్యుతాపురం
అచ్చుతాపురం మండలంలో నెంబర్ ప్లేట్లు లేకుండా లారీలు, బెంజ్ లారీలు దర్జాగా తిరుగుతున్నాయి. కొన్ని లారీలకు నెంబర్ ప్లేట్ ఉన్నా ఆ నెంబర్ కనిపించుకుండా రంగు పులుముతున్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే లారీలు వల్ల ఎప్పుడైనా ప్రమాదం సంభవిస్తే ఆ లారీని గుర్తుపట్టడం ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వాహనాల రద్దీ కారణంగా అనకాపల్లి-అచ్యుతాపురం రహదారిలో ఇప్పటికే పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. నెంబర్ ప్లేట్ ఉంటే ప్రమాదం జరిగినప్పుడు చూసిన వ్యక్తి ఫలానా నెంబర్ గల లారీ అని ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ లేని పక్షంలో ఏ లారీపై ఫిర్యాదు చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు. నెంబర్ ప్లేట్ లేని ఇటువంటి లారీలు అచ్యుతాపురం జంక్షన్ మీదుగా తిరిగితున్నా రవాణాశాఖ అధికారులుగాని, పోలీసులుగాని వాటిపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లారీ యజమానులు ముందు జాగ్రత్తగానే నెంబర్ ప్లేట్ లేకుండా లారీలు తిప్పుతున్నట్లు తెలుస్తోంది. చిన్నపాటి ద్విచక్ర వాహనమైనా నెంబర్ ప్లేట్లు ముందు వెనక లేకపోతే పోలీసులు అడ్డగిస్తున్నారని, అలాంటిది పెద్దపెద్ద లారీలు సైతం నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు వీటిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.










