
ఫొటో : వరి ధాన్యం బస్తాలు
నెమ్ము సాకుతో దోపిడీ..!
- గిట్టుబాటుగాని ప్రభుత్వ మద్దతు
- ఖరీఫ్‌లోనూ నష్టపోయిన అన్నదాత
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : రైతులు ఖరీఫ్‌లో పండించిన ధాన్యానికి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర రైతులకు గిట్టుబాటు కలగలేదు. నెమ్ము శాతం కింద తీసేసిన ధాన్యం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా రైతులు ఆరుగాలాల పాటు కష్టించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు లభించకుండా పోయింది. దాంతో ఈ ఖరీఫ్‌లో పండించిన ధాన్యంపై తోటపల్లిగూడూరు మండల రైతులు దాదాపుగా రూ. 0 కోట్లు నష్టపోయారు. ఖరీఫ్ సీజన్‌ను పురస్కరించుకొని మండలంలోని 22 గ్రామ పంచాయతీల పరిధిలో రైతులు సుమారు 15-20 వేల ఎకరాలలో వరి సాగు చేపట్టారు. కాగా, ప్రభుత్వం మద్దతు ధర కింద రూ.17,500 ప్రకటించింది. కాగా, పుట్టి ధాన్యాని (850 కిలోల)కి నెమ్ము శాతం కింద 50 కిలోలు తరుగుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పుట్టి ధాన్యాంపై నెమ్ము శాతం కింద ఏకంగా 250 కిలోలు తరుగు కింద తీసేయడ ంతో రూ.5,500లు రైతులు కోల్పోవాల్సి వచ్చింది. దాంతో పుట్టి ధాన్యంకు గానూ ప్రభుత్వం మద్దతు ధరగా నిర్ణయించిన రూ.17,500లకు గానూ రైతులకు మిగిలింది కేవలం రూ.12 వేలు మాత్రమే. ఇందుకు సిఎంఆర్ విధానం అమలు లోపభూయిష్టంగా వుండడమేనని రైతులు ఆరోపిస్తున్నారు. ఖరీఫ్‌లో తాము పండించిన ధాన్యానికి అటు క్లస్టర్ మిల్డ్ రైస్ (సిఎంఆర్), ఇటు రైసు మిల్లర్లు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తుందని ఆశించిన అన్నదాతలకు చివరకు నిరాశే మిగిలింది. తరుగు కింద తగ్గించిన నెమ్ము శాతాన్ని పక్కన పెడితే, ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించేందుకు ట్రాక్టర్ బాడుగలకు వెచ్చించినా రవాణా ఖర్చు అదనపు భారంగా మారింది. ధాన్యానికి మద్దతు ధరలు లభించక పోయినా స్థిరీకరణ నిధి ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురు చూసిన రైతుల ఆశా భంగమైంది. గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాల్సిందిగా రైతులు ఎంతగా మొత్తుకున్ననప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనిపించక పోవడం విచారకరం. గిట్టుబాటు ధరలు లేకుండానే ఖరీఫ్‌లో పండించిన ధాన్యంలో 90 శాతం విక్రయాలు జరిగిపోయాయి. ఇక మిగిలింది కేవలం 10 శాతం ధాన్యం మాత్రమే. ఏదేమైనా కరోనా వైరస్ నేపథ్యంలో రబీ సీజన్‌లో పండించిన ధాన్యానికి మద్దతు ధరలు లభించక నష్టపోయిన రైతులు నెమ్ము శాతం సాకుతో రైసు మిల్లర్లు, ధాన్యం దళారుల దోపిడీతో ఖరీఫ్‌లో కూడా నష్టపోయారు.