నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపం
అవస్థలు పడుతున్న వాహనదారులు
పట్టించుకోని జివిఎంసి అధికారులు
ప్రజాశక్తి -గాజువాక : అధికారుల పర్యవేక్షణాలోపం, నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపం వల్ల లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన తారురోడ్డు నెలరోజులు తిరక్కుండానే గోతులమయమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం కొన్ని నెలలపాటైనా ఉండాల్సిన రోడ్డు, రోజుల్లోనే పాడవ్వడంపై వాహనదారులు, స్థానికులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత జివిఎంసి అధికారులు స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
గాజువాక జివిఎంసి జోన్ పరిధిలోని జగ్గు జంక్షన్ నుంచి గంగవరం పోర్ట్‌కు వెళ్లే రహదారిలో నెలరోజుల క్రితమే రూ. 25 లక్షల జివిఎంసి నిధులతో తారురోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇంతలోనే రోడ్డుపొడుగునా పలుచోట్ల గోతులు ఏర్పడడంతో వాహనదారులు, ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నిర్మాణ పనుల్లో సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడడం వల్లే కాంట్రాక్టరు ఇష్టారాజ్యంగాపనులు చేశాడని, దీంతో రోజుల వ్యవధిలోనే రోడ్డుల్లో గోతులేర్పడ్డాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గంగవరం పోర్టుకు వెళ్లే వాహనాలతోపాటు గంగవరం పోర్టు, స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లే ఉద్యోగులతో నిత్యం ఈమార్గంలో ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పునర్నిర్మించిన రోడ్డు కొద్దిరోజుల్లోనే పాడవవ్వడంపై పలువురుమండిపడ్డారు. రోడ్డు బాగా ఉందని, కాస్తా వేగం పెంచి ప్రయాణించిన వాహనదారులు ఇద్దరు ప్రమాదానికి గురై గాయాల పాలైన ఘటన చోటుచేసుకుందని అంటున్నారు. అంతేకాక కాస్తా చీకటి పడితే ఈ మార్గంలో వీధిదీపాల వెలుగులు లేకపోవడంతో రాకపోకలకు మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించి, మూన్నాళ్లకే పాడైన రోడ్డును బాగుచేయించడంతోపాటు ఈ మార్గంలో వీధిదీపాలు వేయించి ఇబ్బందులు తొలగించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.










