నిరీక్షణ
ఒకానొక మరణయాతన
పుడమితల్లికి పురిటినొప్పులు!?
ఆమె ఎన్ని స్వప్నాలను
అల్లుకుంది
ఎన్నెన్ని ఉద్వేగ క్షణాల్ని
మోసింది
వెలుగులేవో కమ్ముతాయని
నిరాశాలన్నీ తొలిగి పోయేనని
పేగు బంధమేదో...
ముద్దుగా మురిపెంగా
డొక్కలో తన్నదేమి?!
ఒక్క ఆశా నన్ను గెలిపించదేమీ?
నవమాసాలొక ప్రశ్న?
గర్భవిచ్ఛిత్తి
మత పిండం
అందని ఆకాశమేనా నా ఆశ?
నేల తడవని వానేనా నా ప్రేమ?!
బతుకంతా శోకసంద్ర కీర్తనే!
మాతృత్వమొక శాపమేనా?!
గడ్డకట్టిన కాలం
దేవుడా! దేవుడా! నేనో బొమ్మేనా?! అమ్మను కానా?!
లోకమా! లోకమా! ఏమిటీ చులకన?
ఎందుకు? నాకెందుకు?
గొడ్రాలు అంపశయ్య సత్కారాలు!
అనువదించలేని అవమానాలు
ఎందుకీ వేదన? ఏమిటీ శోధన?
నన్నెందుకు ఆడపిల్లగా
ఈ భూమ్మీదకు తెచ్చావు అమ్మా?
భూమితల్లీ నన్ను క్షమించు
నేను ఈ దేశాన్ని సుసంపన్నంగా
ఉంచలేను!
ఈ బాధకు ఏ పర్యాయపదమూ లేదు!?
ప్రభావతి దొంతు
96039 61092