Jun 17,2023 00:46

ఎస్టీ కాలనీలో మరమ్మతుకు గురైన బోరు పంపు

ప్రజాశక్తి - బెల్లంకొండ : మండుతున్న ఎండలు ఒకవైపు అల్లాడిస్తుంటే మరోవైపు బోర్లు మరమ్మతులకు గురై గొంతులు ఎండుతున్నాయి. ఇంటి అవసరాలకు బిందెడు నీరు కావాలన్నా అవస్థ పడాల్సి వస్తోంది. మండల కేంద్రమైన బెల్లంకొండలోని ఎస్టీ, బీసీ కాలనీల్లో ఈ సమస్య నెలల తరబడి పీడిస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. బెల్లకొండ ప్రజల నీటి అవసరాలు తీరే మార్గం ప్రధానంగా చేతి బోర్లే. కొంతమంది సొంతంగా బోర్లు వేసుకోగా మిగతావారంతా పంచాయతీ బోర్ల ద్వారానే నీరు తెచ్చుకుంటారు. గ్రామంలోని ఎస్టీ, బీసీ కాలనీలు పక్కపక్కన ఉండగా ఒక్కో కాలనీకి నాలుగు చొప్పున 8 బోర్లున్నాయి. వీటిల్లో నాలుగు బోర్లు మరమ్మతులకు గురై రెండు మూణ్ణెల్లుగా పని చేయడం లేదు. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులను సంప్రదించినా పట్టించుకోవడం లేదని స్థానిక ఎస్టీ కాలనీ ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని వివిధ స్థాయిల సమీక్షల్లో నిత్యం చెబుతున్నా అవేవీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. దీనిపై స్థానిక సర్పంచ్‌ జి.జ్యోతిని సంప్రదించగా.. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారం కావడంతో తన మాట పంచాయతీ కార్యదర్శి వినడం లేదని అన్నారు. పంచాయతీలో ఏ కార్యక్రమాలు చేసినా తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, కార్యదర్శిని ప్రశ్నించినా 'మీకు చెప్పాల్సిన అవసరం లేదు.. చేతనైంది చేసుకోండి..' అంటున్నారని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి మధ్యాహ్నం 12 గంటలకు కార్యాలయానికి వస్తున్నారని, 4 గంటలకు వెళ్లిపోతున్నారని, ఏమైనా అడిగితే వ్యంగ్యంగా సమాధానం ఇస్తున్నారని అన్నారు. మరోవైపు పారిశుధ్య పనులూ తమ ప్రాంతాల్లో సరిగా చేయడం లేదని ఎస్టీ కాలనీ ప్రజలు చెబుతున్నారు. చెత్తను తొలగించాలన్నా, కాల్వలు పూడిక తీయాలన్నా వారం, నెలల తరబడి జాప్యం చేస్తున్నారని అంటున్నారు.