ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : తమకు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, జీవో 132 ప్రకారం పీఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యాలు అమలు చేయాలని పంచాయతీ కార్మికులు కోరారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్‌రెడ్డికి శుక్రవారం వినతిపత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సిలార్ మసూద్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని పంచాయతీ స్వచ్ఛభారత్ కార్మికులకు 6 నెలల నుండి 18 నెలల వరకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇచ్చేదే అరకొర జీతాలని, వాటినీ సమయానికి ఇవ్వకపోతే కార్మికుల కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. జిఒ 680 ప్రకారం ప్రతి స్వచ్ఛభారత్ కార్మికుడికి రూ.10 వేల వేతనాన్ని ఇవ్వాలన్నారు. 2015లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం టెండర్ పద్ధతి లేకుండా కొనసాగించాలని టెండర్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్మికులు కె.కోటయ్య, వి.శ్రీనివాసరావు, జి.అబ్రహం, ఎ.నర సమ్మ, ఆర్.మేరీ, ఆర్.నరసింహ, ఆర్.రత్నకుమారి, ఆర్.కమలమ్మ, ఆర్.ప్రమీల పాల్గొన్నారు.










