May 10,2023 00:06

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో సామాజిక వైద్య సేవల్లో కీలక భూమిక పోషిస్తున్న 104, 108 వాహనాల సిబ్బందికి మూణ్ణెల్లుగా వేతనాలు రావడం లేదు. విధి నిర్వహణ కోసం వెళ్లడానికి ప్రయాణ ఖర్చులకు సైతం అప్పులు చేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడుతూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నామని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామంటున్నారు.
104,108 వాహనాల్లో దాదాపు 500 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 104, 108 సిబ్బందిగా పని చేస్తున్న డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పారామెడికల్‌ సిబ్బందికి జీతాలు చేతికి రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో 104 సిబ్బంది పది రోజులుగా శాంతియుత నిరసనలు చేపట్టారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నారు. తమ పరిధిలోని వైద్యుల వద్ద కూడా గోడు వెళ్లబోసుకుంటున్నారు.
రోడ్డు ప్రమాదాలు, గర్భిణులకు డెలివరీలు, పాముకాటు, ఇతర ప్రమాదాల్లో ఉన్న వారికి అత్యవసర వైద్య సేవలు అందించేందుకు108 వాహనాల సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలులో భాగంగా 104 వాహనాల సిబ్బంది వైద్యులతో పాటు ఇటీవల మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్తున్నారు. ఒక్కో వాహనం రోజుకు రెండు నుంచి మూడు గ్రామాలకు వెళ్తుంది. అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని పరీక్షలు చేసి చికిత్సలు అందిస్తున్నారు. అత్యంత విలువైన వైద్య సేవలు అందించే సిబ్బందికి జీతాలు అందకున్నా ప్రభుత్వం పట్టించుకోని తీరును పలువురు విమర్శిస్తున్నారు.
అరబిందో కంపెనీ యాజమాన్యంలో కొనసాగుతున్న 104, 108 సేవలను రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించాల్సిన అవసరం ఉండగా వాటిని పట్టించుకోకపోవడంతో అరబిందో కంపెనీ యాజమాన్యం తమపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు సిబ్బంది వాపోతున్నారు. వాహనాల నిర్వహణ, సిబ్బంది సంక్షేమంపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వస్తున్నాయి. స్థానిక మండలాల్లో కాకుండా ఇతర మండలాల్లో సిబ్బంది పని చేయాల్సి ఉండటంతో ప్రయాణ ఖర్చులు అధికమవుతున్నాయి. నెలలు తరబడి జీతాలు లేని పరిస్థితుల్లో ఉద్యోగాలకు వెళ్లాలన్న అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతోకాలంగా 104, 108 వాహనాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న తమను అరబిందో కంపెనీ యాజమాన్యం పరిధినుంచి తప్పించి ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తున్న అప్కాస్‌ ద్వారా తమకు నియామక ఉత్తర్వులు అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు.