Sep 09,2023 23:42

అమరావతి హాస్పిటల్‌లో రోగులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శివశంకర్‌

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఆదేశించారు. అమరావతిలో శనివారం పర్యటించిన ఆయన స్థానిక కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసు కున్నారు. గైనకాలజిస్ట్‌ ఆలస్యంగా హాజరవ్వడంపై షోకాస్‌ నోటీసులు జారీ చేశారు. వైద్యులు కచ్చితంగా సమయ పాలన పాటించాలని, గర్భిణులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని చెప్పారు. ప్రతినెలా జరిగే ప్రధానమంత్రి సురక్షిత్‌ మాతృత్వ అభియాన్‌ దినోత్సవం రోజున కావాల్సిన వసతులు, భోజనం, తాగునీరు వంటి మాలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ఇందుకు మాతాశిశు సురక్షిత కార్యక్రమం కింద వచ్చిన నిధులను ఖర్చు చేయాలని ఆదేశించారు. సెలవులో ఉన్న వైద్యుల వివరా లను, విధుల్లో ఉన్న వైద్యుల వివరాలను రిసెప్షన్‌ బోర్డులో వేర్వేరుగా పొందుపరచాలని చెప్పారు. హాస్పిటల్లో అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. రక్త సేకరణ కేంద్రాన్ని త్వరలో అందుబాటులోకి తేవాలన్నారు. కంటి వెలుగు కింద పరీక్ష చేయించుకున్న వారికి త్వరగా ఆపరేషన్‌ చేయాలని సూచించారు. పారిశుధ్యం, ఇతర వైద్య సేవలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అవుట్‌ పేషంట్‌, ఇన్‌ పేషంట్‌ విభాగాల్లో పర్యవేక్షణను అభినందించారు. నెలకు కనీసం 40 ప్రసవాలకు తగ్గకుండా చేయాలన్నారు. పెదకూర పాడులోని ప్రభుత్వ వైద్యశాలనూ కలెక్టర్‌ తనిఖీ చేశారు.
విద్యార్థులతో కలిసి భోజనం
అమరావతిలోని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలను కలెక్టర్‌ సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలేమైనా ఉన్నాయా? అని అడిగారు. మధ్యాహ్న భోజనం మెనూ అమలుపై వివరాల డిగారు. పలు సబ్జెక్టుల్లో విషయాలపై విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.