ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : సెప్టెంబరు నెలాఖరు నాటికి జిల్లా ఆసుపత్రి వివిధ విభాగాల ఆధునీకరణ పనులు పూర్తి చేసి వైద్య సేవలందించేందుకు వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా ఆసుపత్రిలో చేపడుతున్న ఆధునీకరణ పనులను సోమవారం పరిశీలించారు. ఔట్ పేషెంట్, ఆపరేషన్ థియేటర్ విభాగాలను రూ.30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మరమ్మతు పనులను నిశితంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు మరింత సౌకర్యాలు కల్పించి వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందించేందుకు ప్రత్యేక పర్యవేక్షణతో త్వరితగతిన పనులు చేపట్టాలని ఎపి ఎంఎస్‌ఐడిసి ఉప కార్యనిర్వహక ఇంజనీరు బి.ప్రసన్న కుమార్‌ను ఆదేశించారు. ఇప్పటికే ఓపి విభాగం పనులు పూర్తయ్యాయని, ఎలక్ట్రికల్, పెయింటింగ్ పనులు పూర్తి కావాల్సి ఉందని కలెక్టర్‌కు డిఇ వివరించారు. భవిష్యత్‌లో భవనం లీకేజులు, మరమ్మతులు అవసరం లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణం, ఫ్లోరింగ్ తదితర పనులను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వాగ్దేవి, వైద్యులు డాక్టర్ పి.రవికుమార్, డాక్టర్ శేష గిరి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










