- గృహనిర్మాణ సంస్థ పీడీ ఎన్.గణపతి
ప్రజాశక్తి - పలాస: ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన గృహాలను ఈనెలాఖరు నాటికి పూర్తి చేసి, సామూహిక గృహ ప్రవేశాలకు సిద్ధం చేస్తున్నట్లు గృహనిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎన్.గణపతి తెలిపారు. మండలంలోని రామకృష్ణాపురంలో జగనన్న లేఅవుట్‌ను మంగళవారం పరిశీలించారు. లేఅవుట్‌లో మురుగు కాలువలు, సిసి రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం ప్రణాళికను సిద్ధం చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 834 జగనన్న లేఅవుట్లలో 38,866, సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కోసం 36,974 గృహాలను మంజూరు చేసినట్లు తెలిపారు. జగనన్న లేఅవుట్లలో 5,117, సొంత స్థలాల్లో 23,550 గృహాలను పూర్తి చేసినట్లు చెప్పారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్ల, పలాస, టెక్కలి, నరసన్నపేట మండలాల్లో తొలి విడతగా 33 జగనన్న లేఅవుట్ల వద్ద సింహద్వారం నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. 20 అడుగుల వెడల్పులో ఉన్న సింహద్వారానికి సుమారు రూ.4.15 లక్షలు, 30 అడుగుల వెడల్పులో ఉన్న సింహద్వారానికి రూ.ఐదు లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. 25 ఇళ్లు పైబడి ఉన్న లేఅవుట్లకు మాత్రమే సింహద్వారం మంజూరు చేశామన్నారు. ఆయన వెంట పలాస హౌసింగ్ డిఇఇ రెడ్డి అనంతరావు, హౌసింగ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.










