ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : స్లాబ్ లెవల్‌కు వచ్చిన 1485 గృహాలు, స్లాబ్ పూర్తయిన 1284 గృహాలు మొతయతం 2769 గృహాలను ఈ నెలాఖరుకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశించారు. గృహ నిర్మాణ పురోగతిపై కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో గురువారం సమీక్షించారు. స్టేజి కన్వర్షన్‌లను త్వరగా పూర్తి చేసి నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. బేస్మెంట్ లెవెల్ గృహాలపై దృష్టి పెట్టాలని, ముందస్తుగా ఇనుము, ఇసుక వంటి సామగ్రి తీసుకుని కూడా పనులు మొదటి పెట్టని వారి వివరాలు సేకరించాలని చెప్పారు. లే అవుట్‌లలో విద్యుత్, తాగునీరు తదితర సదుపాయాలు కల్పించలన్నారు. జగనన్న కాలనీల ఆర్చీల నిర్మాణానికి స్థానికంగా అంచనాలు వేసి రెండ్రోల్లో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమీక్షలో గృహనిర్మాణ శాఖ పీడీ వేణుగోపాలరావు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి సురేష్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.










