తుళ్లూరు: అమరావతి రాజధానిలోని నెక్కల్లు, అనంతవరం లే అవుట్ లలో జరుగుతున్న పనులను సి ఆర్ డి ఎ కమిషనర్ వివేక్ యాదవ్ శుక్రవారం పరిశీలించారు. నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు పథకం అమలులో భాగంగా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన పేద లకు ప్రభుత్వం సెంటు స్థలం పంపిణీకి నిర్ణయించింది. ఇందుకు గాను లే అవుట్ లలో జంగిల్ క్లియరెన్స్, ప్లాట్ల చదును లాంటి పనులు చేపట్టింది.ఈ నేపథ్యంలో కమి షనర్ అమరావతి రాజధానిలోని నెక్కల్లు, అనంతవరం లోని లే అవుట్ లో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు.మ్యాపులను పరిశీలించి, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నెక్కల్లులో 100 ఎకరాలలో ఏర్పాటవుతున్న గుంటూరు - 12 లో పనులను పరిశీలించారు.ఇందులో భూమి చదును పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో పెగ్ మార్కింగ్,అంతర్గత గ్రావెల్ రహదారుల పనులను కూడా త్వరిత గతిన పూర్తయ్యేలా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఇందులో 4,402 ప్లాట్ లకు సంబంధించిన పురోగతిని ముఖ్య ఇంజనీర్ ప్రసాద్ కమిషనర్ కు వివరించారు.అనంతవరం లే అవుట్ లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,అన్ని లేఅవుట్ల అభివృద్ధి పనులను అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ,లక్ష్యాలను అధిగమించే దిశగా సాగాలని సూచించారు.










