
ప్రజాశక్తి-రాంబిల్లి
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని మండలంలోని వాడనర్సాపురం వద్ద ఎన్‌ఎఒబి నిర్వాసితులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం శిబిరాన్ని గురువారం టిడిపి యలమంచిలి నియోజకవర్గం ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌ఎఒబితో నిర్వాసితులైన కొప్పుగొండుపాలెం గ్రామస్తులకు కూడా జీవన భృతి ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేవల్ బేస్‌కు భూములు కోల్పోయి నిర్వాసితులు తమకు న్యాయం చేయండి మహాప్రభో అంటూ రోజులు తరబడి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. టీడీపీ ప్రభుత్వం హాయాంలో ఈ గ్రామ నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. వైసిపి ప్రభుత్వం వాడనర్సాపురం, కొత్తపట్నం గ్రామాల నిర్వాసితులకు జీవన భృతి ప్యాకేజీ ప్రకటించి, కొప్పుగొండుపాలెం వారికి ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ గ్రామానికి కూడా జీవన భృతి ప్యాకేజీ కచ్చితంగా ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డి.రంగనాయకులు, నాయకులు కశిరెడ్డి ప్రసాద్, మండల అధ్యక్షులు వి.దినబాబు, సూరాడ అప్పలరాజు, మాజీ సర్పంచ్ బి.రమణ, చిట్టిబాబు పాల్గొన్నారు.