ప్రజాశక్తి-రాంబిల్లి
ఎన్‌ఎఒబి నిర్వాసితుల సమస్యలపై అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డికి శుక్రవారం నేవీ నిర్వాసిత జెఎసి నాయకులు వినతిపత్రం అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే యువి.రమణమూర్తిరాజు ఎనిమిది గ్రామాల నిర్వాసిత పెద్దలను తీసుకొని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యాన ముఖ్యమంత్రిని కలిశారు. ఏళ్ల తరబడి తమ సమస్యలు పరిష్కారం కాలేదని, దీనిపై రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నామని, తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనికి ఆయన స్పందించి రాష్ట్ర సచివాలయం స్పెషలాఫీషర్ విజయానంద్, రాష్ట్ర మత్స్యకార డైరెక్టర్ కన్నబాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పఠాన్‌శెట్టికి ఆదేశాలు జారీ చేశారని, నేవీ నిర్వాసిత సమస్యల పరిష్కారానికి వెంటనే కార్యచరణ చేపట్టారని ఆదేశించారని నిర్వాసిత పెద్దలు చెప్పారు.
61వ రోజు కొనసాగిన ఆందోళన
నావల్ బేస్ నిర్వాసితులు నేవీ మెయిన్ గేట్ వద్ద చేపట్టిన ఆందోళన శుక్రవారం నాటికి 61వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చోడిపెళ్లి గంగరాజు మాట్లాడుతూ నేవీ నిర్వాసితుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేదని విమర్శించారు. నేవల్ బేస్ నిర్మాణం వల్ల 8 గ్రామాల ప్రజలు తమ జీవనోపాధి కోల్పోయారని, నిర్వాసితుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి జిల్లా అధికారి యంత్రాంగం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. నిర్వాసిత పెద్దలు, అఖిలపక్ష నాయకులతో, జిల్లా అధికార యంత్రాంగం అనేకసార్లు చర్చలు జరిపిన సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని పేర్కొన్నారు. నేవీ నిర్వాసితుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.










