Dec 15,2022 00:20

ధర్నాలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం

ప్రజాశక్తి-రాంబిల్లి
నేవల్‌ బేస్‌ నిర్వాసితుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికారుల నిర్లక్ష్యం తగదని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం అన్నారు. నేవీ మెయిన్‌ గేట్‌ వద్ద ఎనిమిది గ్రామాల నిర్వాసితులు చేపట్టిన ఆందోళన బుధవారం నాటికి 45వ రోజుకు చేరింది. ఈ ఆందోళన శిబిరాన్ని సందర్శించిన లోకనాథం మాట్లాడుతూ నేవీ నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని 45 రోజులుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ ప్రాంతంలో పర్యటించినప్పటికీ, నిర్వాసితులతో మాట్లాడినప్పటికీ, నిర్వాసితులు సమస్యలు పట్ల స్పష్టమైన హామీలు ఇవ్వకపోవడం, వాటి అమలుకు కృషి చేయకపోవడం బాధాకరమన్నారు. పిఏఎఫ్‌ పిడిఎఫ్‌ గ్రామాల ప్రజల సమస్యలతో పాటు, నేవీ ప్రభావిత గ్రామాల చిన్న కలవలపల్లి, కొత్తపేట గోవిందపాలెం, వాడపాలెం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసితులందరికీ ఉపాధి కచ్చితంగా కల్పించి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జి దేవుడు నాయుడు, జేఏసీ పెద్దలు, నిర్వాసితులు పాల్గొన్నారు.