Nov 22,2022 00:12

ధర్నాలో మాట్లాడుతున్న ఐద్వా జిల్లా అధ్యక్షులు మాణిక్యం

ప్రజాశక్తి - రాంబిల్లి
నేవీ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఐద్వా జిల్లా అధ్యక్షులు పి.మాణిక్యం అన్నారు. నేవల్‌ బేస్‌ నిర్వాసితులు నేవీ మెయిన్‌ గేట్‌ ముందు చేపట్టిన ఆందోళన సోమవారం నాటికి 22వ రోజుకు చేరింది. ఈ ఆందోళన శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన మాణిక్యం మాట్లాడుతూ నేవీ నిర్మాణం కోసం నిర్వాసితులైన మత్స్యకారులు, రైతులు, గొర్రెలు మేకలు పెంపకం దారులు, కల్లుగీత కార్మికులు, వ్యవసాయ కూలీలు నేడు పనుల్లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. శారద, వరాహ నదులపై ఆధారపడి జీవించే మత్స్యకారులను అడ్డుకుంటుంటే ప్రభుత్వాలు, అధికారులు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో జీవోలు, హామీలిచ్చిన ప్రభుత్వాలు, అధికారులే వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. మగవారిని ఒకలాగా, ఆడవారిని ఒకలాగా గుర్తించి అన్యాయమన్నారు. ప్రాజెక్టు వచ్చి 17 సంవత్సరాలు అవుతున్నా నేవీ నిర్వాతుల సమస్యలు పరిష్కరించకపోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం, నేవీ అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి నిర్వాసితుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ధర్నా శిబిరంలో జరిపి, మత్స్యకారులు జరుగుతున్నన అన్యాయంపై అన్ని గ్రామాల పెద్దలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎనిమది గ్రామాల ప్రజాప్రతినిధులు, వేలాది మందిని నిర్వాసితులు పాల్గొన్నారు.