ప్రజాశక్తి -రాంబిల్లి
నేవల్ బేస్ నిర్వాసితుల సమస్యలను 17 సంవత్సరాలుగా పూర్తిస్థాయిలో పరిష్కరించకుండా కాలయాపన చేయడం ప్రభుత్వాలకు తగదని సిపిఎం మండల కార్యదర్శి జి.దేముడునాయుడు అన్నారు. నేవీ మెయిన్ గేటు ముందు ఎనిమిది గ్రామాల నిర్వాసితులు చేపట్టిన ఆందోళన గురువారం నాటికి 25వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా దేముడునాయుడు నిర్వాసితులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన బాట పెట్టినప్పుడు కొన్ని సమస్యల పరిష్కరించి మిగతా వాటిని పరిష్కరించకుండా వదిలేయడం పరిపాటిగా మారిందన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో వ్యవహరించి, జీవన భృతి కల్పించాలని, పెండింగ్ ప్యాకేజీలు అందజేయాలని, మత్స్యకారుల చేపలు వేటకు జెట్టీ నిర్మించాలని, నిర్మాణ పనుల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని, ఆధార్ కార్డు ఆధారంగా శారద, వరాహ నదుల్లో చేపలు వేటకు పంపాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ భూములకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, శ్మశాన స్థలాలు కేటాయించాలని, ప్రభావిత గ్రామాలను నిర్వాసిత గ్రామాలుగా గుర్తించి ప్యాకేజీలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎఒబి నిర్వాసితుల జెఎసి నాయకులు, వేలాది మంది నిర్వాసితులు పాల్గొన్నారు.










