ప్రజాశక్తి- రాంబిల్లి
నేవీ నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి జి.దేవుడునాయుడు డిమాండ్ చేశారు. నేవీ గేట్ ముందు నేవల్ బేస్ నిర్వాసితులు ఎనిమిది గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళన సోమవారం నాటికి 29వ రోజుకి చేరుకుంది. ఇందులో పాల్గొన్న దేవుడునాయుడు మాట్లాడుతూ నేవీ వల్ల సర్వం కోల్పోయిన నిర్వాసితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, జీవన భృతి చెల్లించాలని, పెండింగ్ ప్యాకేజీలు అందజేయాలని డిమాండ్ చేశారు. చేపలు వేటకు అనుకూలంగా జెట్టీ నిర్మించాలని, నిర్మాణ పనుల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని, ఆధార్ కార్డు ఆధారంగానే శారద, వరాహ నదుల్లో చేపలు వేటకు పంపాలని కోరారు. 17 సంవత్సరాలుగా నేవీ నిర్వాసితుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించకుండా కాలయాపన చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది గ్రామాలు జేఏసీ పెద్దలు, వేలాదిమంది నిర్వాసితులు పాల్గొన్నారు.










