Feb 14,2023 23:46

ఆందోళన చేస్తున్న నేవీ నిర్వాసితులు

ప్రజాశక్తి- రాంబిల్లి
ఎన్‌ఎఒబి నిర్వాసితుల సమస్యలపై నేవీ నిర్వాసిత జెఎసి పెద్దలతో అనకాపల్లి ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ బోట్లకు రూ.4 లక్షల చొప్పున ఇవ్వాలని, ప్రతి రేషన్‌ కార్డుకు, నేటికీ 18 సంవత్సరాలు నిండిన మేజర్‌ కుమారులకు, రెండో విడత నోటిఫికేషన్‌ వచ్చే వరకు, నెలకు రూ.14,300 చొప్పున జీవన భృతి ఇవ్వాలని, శాశ్వత ఉపాధి కల్పించాలని, మిగిలిన 6 గ్రామాల సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీనిపై ఆర్‌డిఒ చిన్ని కృష్ణ, మత్స్యశాఖ జెడి మాట్లాడుతూ నెలకు రూ.13,000 చొప్పున ప్రతి రేషన్‌ కార్డుకు ఇవ్వడానికి అవకాశం ఉందని, మేజర్‌ కుమారుల కోసం ప్రభుత్వ అనుమతి ఇంకా తీసుకోవాలని, ఫిషింగ్‌ బోట్లకు ఒక్కో బోటుకు రెండున్నర లక్షలు రూపాయలు ఇవ్వడానికి అవకాశం ఉందని తెలిపారు. ఇలాగైతే తమకు న్యాయం జరగదని నేవీ నిర్వాసిత పెద్దలు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేసి వెనుదిరిగారు. మరో వైపు మండలంలోని వాడనర్సాపురం వద్ద నేవీ మెయిన్‌ ముందు 8 గ్రామాల నిర్వాసితులు చేస్తున్న ఆందోళన 107వ రోజు కూడా కొనసాగింది. తమ సమస్యలను పరిష్కరించాలని నిర్వాసితులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.