ప్రజాశక్తి -ఆనందపురం : ఇంటి పెద్ద దిక్కు హఠాన్మరణం పొందిన పుట్టెడు దుంఖ:లోనూ, అతని కళ్లను దానం చేసి తమ ఔదార్యాన్ని చాటుకుందీ అ కుటుంబం. తద్వారా బతికున్నంత కాలం అందరికీ సాయపడే వ్యక్తి గాంధీ, చనిపోయిన తర్వాత కూడా మరో ఇద్దరికి కంటిచూపును ప్రసాదించాడని పలువురు కొనియాడారు.
పెందుర్తి అయ్యప్ప గుడి ఎదురుగా ఉన్న కాలనీలో నివాసముంటున్న మేడిపబోయిన గాంధీ ప్రసాద్(74) సోమవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఉదయానే టీ తాగేందుకు దుకాణానికి వెళ్లి, అక్కడే కుప్పకూలి మరణించాడు. దీంతో మృతుని భార్య, కుమార్తె అక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరై విలపించారు. అయితే గాంధీ కళ్లు తెరిచే మరణించడాన్ని గమనించిన వారు, అతని కళ్లను దానం చేసేందుకు విశాఖపట్నం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి సమాచారమిచ్చారు. నేత్రవైద్య నిపుణులు బాలామణి ఆధ్వర్యంలో గాంధీ కళ్లను సేకరించి భద్రపరిచారు. దీంతో ఇద్దరికి కంటిచూపును ప్రసాదించవచ్చని డాక్టర్ బాలామణి అన్నారు. అనంతరం కుటుంబసభ్యులకు సర్టిఫికెట్ ఇచ్చారు. గాంధీ అంత్యక్రియల్లో కాలనీవాసులు పాల్గొని ఆయన మంచితనాన్ని కొనియాడారు. .










