Aug 28,2023 22:15

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న జెసి నవీన్‌

* జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం : 
నేత్రదానంతో అంధత్వాన్ని రూపుమాపవచ్చని, అందువల్ల నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ పిలుపునిచ్చారు. ఒకరి నేత్రదానంతో ఇద్దరు వ్యక్తులకు వెలుగును ప్రసాదించవచ్చని తెలిపారు. రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యాన 38వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమాన్ని కళ్యాణ్‌ మగటపల్లి నేత్రదాన సేకరణ కేంద్రం ఆధ్వర్యాన నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత్రదాన పక్షోత్సవాలు ఈనెల 25 నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేత్రదానం అంటే చాలామందిలో అపోహ ఉందని, మరణించిన వ్యక్తి నుండి కార్నియాను మాత్రమే సేకరించి అంధులకు అమర్చడం ద్వారా ఇద్దరికి కంటి చూపును ప్రసాదించవచ్చని వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలో 486 మంది దాతల నుంచి నేత్రాలను సేకరించి, 777 మందికి కంటిచూపును ప్రసాదించినట్లు తెలిపారు. జిల్లాలో అంధులకు అవసరమైన కార్నియాలు లభ్యం కావడం లేదని, నేత్రదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, రెడ్‌క్రాస్‌ సంస్థ చైర్మన్‌ పి.జగన్మోహనరావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్‌ త్రినాథరావు, సెట్‌శ్రీ సిఇఒ బి.వి ప్రసాదరావు, పెంకి చైతన్య కుమార్‌, కె.సత్యనారాయణ, సుజాత, చిన్మయరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.