Sep 08,2023 21:52

ఫొటో : మాట్లాడుతున్న జిల్లా అంథత్వం నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్‌ డాక్టర్‌ శార్వాణి

నేత్రదానంపై అవగాహన సదస్సు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్భన్‌ : ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 38వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా జిల్లా అంథత్వం నివారణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నేత్రదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అంథత్వం నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్‌ డాక్టర్‌ శార్వాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయడం ద్వారా చీకట్లో మగ్గుతున్న అంథులకు వెలుగునిద్దామని ఆమె పిలుపునిచ్చారు. ఒక వ్యక్తి మరణించినా కూడా ఇద్దరు జీవితాలకు వెలుగును పంచే మహత్తర పుణ్య కార్యక్రమం నేత్రదానం అని తెలిపారు.
నేత్రదానాన్ని కుటుంబ సాంప్రదాయంగా మార్చుకుందామన్నారు. నానాటికీ పెరుగుతున్న యాంత్రిక జీవనంతో సమాజంలో చూపు మందగిస్తుందని, నేత్రదానంపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శేషారత్నం మాట్లాడుతూ మనిషి మరణానంతరం మాత్రమే నేత్రదానం చేయవలసి ఉంటుందని తెలిపారు. మరణం సంభవించిన 6 లేదా 8 గంటల్లోపు నేత్రదానం జరపవలసి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, హెడ్‌ నర్సెస్‌, స్టాఫ్‌నర్సులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.