
ప్రజాశక్తి - హెల్త్ యూనివర్సిటీ
: మనిషి జీవితంలో ప్రతీది దృష్టితో ముడిపడి ఉందని, అందుకే కళ్లను నిర్లక్ష్యం చేయరాదని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. సంధ్య కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో వరల్డ్ సైట్ డే సందర్భంగా సూర్యా రావుపేటలో నిర్వహిం చిన వాకథాన్ ను ఆయన ప్రారంభించారు. 'లవ్ యువర్ ఐస్ ఎట్ వర్క్' అనే నినాదంతో సాగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడుతూ, కంటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసి, నేత్ర సంబంధ సమస్యల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు సంధ్య కంటి ఆసుపత్రి నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లను అధికంగా వినియోగించడం వల్ల దృష్టి లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని, స్మార్ట్ ఫోన్లు చూడకుండా, వీడియో గేమ్స్ ఆడకుండా ఉండేలా జాగ్రత్త వహించాలని చెప్పారు. నేత్ర సమస్యలు తలెత్తిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రి సీఈవో మునగపాటి భార్గవ్‌రామ్ మాట్లాడుతూ, ప్రజలందరికీ నేత్ర వైద్య సేవలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో సంధ్య కంటి ఆసుపత్రి నెలకొల్పిన డాక్టర్ ఎం.ఎన్.రాజు ఆశయ సాధనకు కృషి చేస్తామని వెల్లడించారు.