Nov 05,2023 00:04

నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
గడప గడపకు మన ప్రభుత్వంలో మంత్రి ఆకెరోజా
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌ : మునుపెన్నడూ లేనివిధంగా వై.యస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలోనే నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజన సర్వీసులు, క్రీడా శాఖల మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు . శనివారం సాయంత్రం పుత్తూరు మున్సిపాలిటీలోని 9వ వార్డు గోవింద పాలెం, సచివాలయ పరిధిలో సీలకారవీధి, బలిజ వీధిలో గడప పడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి నాలుగున్న రేళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలోని హామీలు 99 శాతం నెరవేర్చి నట్లు చెప్పారు. నేడు అవినీతికి తావులేకుండా వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు ఇంటి గుమ్మం వద్దకే వస్తున్నాయన్నారు. 'అవ్వా పెన్షన్‌ అందిందా ? అక్కా చేయూత అందిందా ?.. అమ్మఒడి అందుతోందా?' అంటూ ఆరా తీశారు. అందరూ అన్నీ అందుతున్నాయని సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ద్వారా లక్షల్లో లబ్ధి చేకూరుతోందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల ప్రత్యేక నిధులు అందుతున్నాయని తెలిపారు. ఈ నిధులు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల సమయంలో పలు హామీలు గుప్పించే చంద్రబాబునాయుడు, తర్వాత ప్రజలను మోసం చేయడం ఆయన నైజమన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికా భివద్ధి సాధించాలంటే రాష్ట్రానికి జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, ఇందుకు ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఏ హరి, వైస్‌ చైర్మన్లు డీ శంకర్‌, డి జయప్రకాష్‌, కౌన్సిలర్లు ఏకాంబరం, గుణ శేఖర్‌, మోహన్‌ రెడ్డి, దిలీప్‌ నాయకులు జయచంద్ర, తిరునావక్కరుసు, ప్రసాద్‌, గోపి, చక్రి పాల్గొన్నారు.