ప్రజాశక్తి-చీరాల: చేనేత రక్షణ, చేనేత ఉత్పత్తులకు మార్కెట్, చేనేత కార్మికులకు పని దినాల కోసం గత ఐదు రోజులుగా చీరాల మండలం జాండ్రపేటలో చేపట్టిన చేనేత కార్మికుల రిలే నిరాహార దీక్షకు టిడిపి చీరాల నియోజకవర్గ నాయకులు సజ్జ వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. చేనేత వృత్తి రక్షణ కోసం గతంలో ఉన్న అనేక పథకాలను వైఎస్సార్ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. రంగులు, రసాయనాలపై సబ్సిడీ, యారన్ సబ్సిడీ, ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు నిధుల కేటాయింపు వంటి పథకాలు రద్దు చేయడంతో చేనేత వస్త్రాల ఉత్పత్తి ఖరీదు పెరిగి కొనుగోలు పడిపోయాయని అన్నారు. దీనితో మాస్టర్ వీవర్ల వద్ద పెద్ద ఎత్తున ఉత్పత్తులు నిల్వ ఉండి కార్మికులకు పని చూపే పరిస్థితి లేదన్నారు. నిరంతరం కార్మికులకు పని దొరకాలంటే చేనేత ఉత్పత్తి ఖర్చు తగ్గించే విధంగా గతంలో ఉన్న సబ్సిడీ పథకాలను అమలు చేయాలని, చేనేత వృత్తి రక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో గుత్తి శివయ్య, సజ్జ రవికుమార్, జాగాబత్తిన పోతురాజు, సజ్జ కోటేశ్వరరావు, బొడ్డు రవికుమార్, బొడ్డు శ్రీనివాసరావు, మెట్ల వెంకటసుబ్బారావు పాల్గొన్నారు.










