ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: నేతన్న నేస్తం పథకం ద్వారా సొంత మగ్గం కలిగిన అర్హులైన చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24వేల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందజేస్తోందని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. జిల్లాలో నేతన్న నేస్తం ఐదో విడతలో 2023- 24 ఆర్థిక సంవత్సరానికి 1,460 మందికి రూ.3.51 కోట్లను వారి ఖాతాలకు జమ చేస్తున్నట్లు చెప్పారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన నేతన్న నేస్తం కార్యక్రమంలో లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేశారు. చేనేత జౌళి శాఖ ఎడి ఐ.ధర్మారావు మాట్లాడుతూ జిల్లాలో 50 ఏళ్లు దాటిన 3,812 చేనేత కార్మికులకు నెలకు రూ.2,750 చొప్పున చేనేత పింఛను అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం ప్రతినిధి మంచు చంద్రయ్య, జిల్లా రెవెన్యూ అధికారి మురళీకృష్ణ, డెవలప్‌మెంట్ ఆఫీసర్ శేఖర్, శ్రీను, ఎడిఒ రమేష్, క్లస్టర్ సిబ్బంది, చేనేత సహకార సంఘాల సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.










