Jul 21,2023 21:12

నేతన్న నేస్తం కొండంత అండ : కలెక్టర్‌

రాయచోటి : వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం చేనేతలకు కొండంత అండగా ఉంటుందని, ఆత్మీయ నేస్తంగా మారిందని, ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలని కలెక్టర్‌ గిరీష అన్నారు. ఐదవ విడత వైయస్సార్‌ నేతన్న నేస్తంను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరి సభ స్థలం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. రాయచోటి కలెక్టరేట్‌ నుండి కలెక్టర్‌ గిరీష, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, చేనేత, జౌళిశాఖ ఎడి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతన్న నేస్తం లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి ఐదో విడతగా వైయస్సార్‌ నేతన్న నేస్తం సంబంధించి 6937 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.16.64 కోట్లు జమ చేశామన్నారు. అర్హులైన చేనేతలకు ఒక్కొక్కరికి రూ.24 వేలు జమ చేశామన్నారు. మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందిన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చేనేతల జీవితాలలో వెలుగులు నింపి వారిలో చిరునవ్వులు చూడాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. ఏవైనా కొన్ని కారణాల వల్ల వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం ద్వారా ప్రస్తుతం లబ్దిపొందలేక పోయిన వారు స్థానిక సచివాలయాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హత ఉండి లబ్ది చేకూరడంలో ఏమైనా సమస్యలు ఉంటే సంబందిత శాఖ జిల్లా అధికారులను, ప్రభుత్వ ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబరు : 1902 కు కాల్‌ చేసి తెలుపవచ్చన్నారు. అనంతరం జిల్లాలో ఐదో విడత వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం కింద 6937 మంది లబ్ధిదారులకు రూ.16.64 కోట్లు మెగా చెక్కును లబ్దిదారులకు కలెక్టర్‌, జెసి అందచేశారు.