ప్రజాశక్తి - భట్టిప్రోలు
స్థానిక నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన పని వాహనదారులు, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలంలోని వెల్లటూరు - చిన్నారేవు నుండి కొల్లూరు మండలం కిష్కిందపాలెం వరకు రహదారి వెంట ఇరువైపులా ప్రోక్లైన్లతో మార్జిన్లకు మట్టిని నింపారు. కొద్దిపాటి వర్షానికే మట్టి అంతా కారి రహదారిపైకి చేరి వాహనాలు జారిపోతున్నాయి. కింద పడిపోయే పరిస్థితి నెలకొంది. గత కొన్నేళ్ళుగా కృష్ణా నది నుండి జువ్వలపాలెం సమీపంలో బుసక మట్టిని జాతీయ రహదారి 216నిర్మాణానికి పెద్ద ఎత్తున తోలుతున్నారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు జాతీయ రహదారి గుత్తేదారినితో కొమ్మక్కై నిత్యం వందల సంఖ్యలో ఈ రహదారిపై లారీలు తిరుగుతుండడంతో రహదారి మార్జిన్లు దెబ్బతిన్నాయి. దీంతో జాతీయ రహదారి గుత్తేదారి వద్ద నుండి కొంత సొమ్మును రాబట్టుకొని నాయకులు రహదారి ప్రక్కనే ఉన్న ఒండ్రు మట్టిని తీసి మార్జనులకు నింపారు. దీంతో ఆ మట్టి రహదారిపైకి చేరి వర్షానికి వాహనాలు తిరగబడుతున్నాయి. సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు సైతం మామూళ్లు పుచ్చుకొని ఒండ్రు మట్టిని మార్జిన్ లకు నింపకూడదని తెలిసి కూడా చూస్తూ ఉండిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. తక్షణమే రహదారిపైకి చేరిన బంకమన్నును తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.










