ప్రజాశక్తి - జామి : ప్రస్తుతం రాజకీయ నాయకులు వాడుతున్న అసభ్యకర పదజాలం పిల్లలపైనా, సమాజంపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తంచేశారు. మంచి ఆలోచనలతో దార్శనిక రాజకీయాలు చేయాలని సూచించారు. మండలంలోని జాగారం గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మహాత్ముని విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ముందుగా గ్రామస్తులు, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాతృభూమి సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. అనంతరం చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. మీడియా వ్యక్తులు కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేసే నాయకులను బహిష్కరించాలని సూచించారు. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకోవడం, ఓటు వినియోగించక పోవడం ప్రజలకు, సమాజానికి మంచిది కాదన్నారు. 100 శాతం ఓటు హక్కు నమోదైనప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలకు తావుండదని చెప్పారు. జనం యాంత్రికంగా తయారు కాకుండా మంచి ఆలోచనలతో సమాజాన్ని మార్చాలని పిలుపునిచ్చారు. అందుకు పిల్లలను సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలని సూచించారు. తాను వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనన్న జెడి... చంద్రబాబు అరెస్టు, కేసు అంశాలు న్యాయస్థానాలు తెలుస్తాయని చెప్పుకొచ్చారు. లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జి మాట్లాడుతూ రాజకీయాల్లో మంచి ఆలోచనలతో, సమాజం పట్ల అవగాహనతో పనిచేసే నాయకులను ప్రజలు తప్పకుండా ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో చెరువుల పరిరక్షణ కమిటీ నాయకులు మరిచర్ల కృష్ణ, మాతృభూమి సేవా సంఘం నాయకులు గోపాలరావు, ఎంపిడిఒ సతీష్, యాదవ సంఘం నాయకులు శేఖర్ యాదవ్, స్వామీజీ, తదితరులు పాల్గొన్నారు.










