ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ భారతదేశ విముక్తి కోసం నినదించిన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ ల గొంతులు ముగబోయి నేటికి సరిగ్గా 91 సంవత్సరాలు అవుతుంది. దేశంకోసం తమ ప్రాణాలను సైతం తణప్రాయంగా త్యాగం చేసిన.ఆ వీరులు నేటి యువతకు స్ఫూర్తి ప్రదాతలు. సరిగ్గా మీసాలు కూడా మొలవని వయస్సులోనే ''జీవితాన్ని ప్రేమిస్తాం మరణాన్నీ ప్రేమిస్తాం మేము మరణించి ఎర్రపూలవనంలో ఉరి కంబాన్ని ఎగతాళి చేస్తాం నిప్పురవ్వల మీద నిద్రిస్తాం'' అంటూ ఉరి కంబాాన్ని ముద్దాడిన అమరవీరులు వారు.
''బ్రతికి ఉన్న భగత్ సింగ్ కంటే చనిపోయిన భగత్‌సింగ్ బ్రిటిష్ వారిఎడల మరింత ప్రమాదకారి. నా విప్లవభావాలు ఈ సుందరమైన మాతభూమి అంతటా వ్యాపించి యువతకు ఉత్తేజమిచ్చి స్వాతంత్య్రం కోసం, సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమికొడాతాయి'' అంటూ ఉరి వేయడానికి కోన్ని నిమిషాలు ముందు భగత్‌సింగ్ బ్రిటిష్ పాలకులను హెచ్చరించారు. షహీద్ భగత్‌సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఎక్కువగా కలవరపెట్టిన పేరు అది.
భగత్‌సింగ్ బాల్యం
భగత్‌సింగ్ పంజాబ్ రాష్ట్రంలోని లాయల్ పూర్ జిల్లా బంగా అనే గ్రామంలో 1907 సెప్టెంబర్ 28న సర్దార్ కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య లాహౌర్ లో డిఎవి పాఠశాలలో జరిగింది. కేవలం మూడేళ్ల వయస్సులోనే విత్తనాలు నాటితే మొక్కలు వచ్చినట్టే తూటాలు నాటుదాం తుపాకులు వస్తాయా నాన్న అంటూ తన తండ్రిని ప్రశ్నించాడు భగత్‌సింగ్. ఎందుకురా అంటే బ్రిటిష్ పాలకులను సులభంగా తరిమికొట్ట వచ్చు కదా అన్నాడు భగత్‌సింగ్. 1919లో జలియన్ వాల్ బాగ్ సంఘటన జరిగినప్పుడు భగత్‌సింగ్ వయస్సు సరిగ్గా పన్నెండేళ్ళు. భగత్‌సింగ్ కుటుంబంతో కలిసి లాహౌర్ నుంచి అమతసర్ లోని జలియన్ వాలా బాగ్ చూడటానికి వెళ్ళి వచ్చేటప్పుడు భారతీయుల నెత్తురుతో తడిసిన మట్టిని కూడా తనతో తెచ్చుకుని ఆ అమరులకు రోజూ నివాళులర్పించేవాడు. . అతి చిన్న వయసులోనే దేశం పట్ల ప్రజల పట్ల మక్కువ పెంచుకున్నారు భగత్ సింగ్. కుటుంబ నేపథ్యం దీనికి తోడైంది. తన తండ్రి కిషన్ సింగ్, బాబారు అజిత్ సింగ్ అప్పటికే స్వతంత్ర పోరాటంలోఉన్నారు. గదర్ వీరుల ప్రభావం కూడా భగత్‌సింగ్ పై ఉంది. కరాచి కుట్ర కేసులో ముద్దాయి అయిన కామ్రేడ్ శచింద్రనాథ్ సన్యాల్ కూడా భగత్‌సింగ్‌ను ఎంతో ప్రభావితం చేశారు.
సోషలిస్టు భావాల పట్ల ఆకర్షణ
గాంధీ ఇచ్చిన సహయ నిరాకరణ ఉద్యమంతో ఆకర్షితుడై భగత్‌సింగ్ అందులో పాల్గొన్నాడు. అప్పటికి భగత్‌సింగ్ వయస్సు 15 ఏళ్ల లోపే. సహాయనిరాకరణ ఉద్యమాన్ని మధ్యలోనే నిలిపివేయడంతో తీవ్ర అసంతప్తి చెందిన యువజనులు రాంప్రసాద్ బిస్మిల్లా., చంద్రశేఖర ఆజాద్. భగవతి చరణ్. సుఖ్‌దేవ్. బటుకేశ్వరదత్, అష్వఖుల్లాఖాన్, శివవర్మ లాంటి వారితో కలిసి నవజవాన్ భారత్ సభను ఆ తర్వాత కాలంలో హిందూస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ అసోసియేషన్ ను స్థాపించారు. తర్వాత హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ గా పేరు మార్పు చేశారు. అధ్యక్షుడుగా చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నారు. తమ అంతిమ లక్ష్యం సోషలిజం అనే నిర్ధారణకు వచ్చారు. 1926 నాటికే భగత్‌సింగ్ నేను నాస్తికుడిని అని ప్రకటించుకున్నారు. మతం, దేవుడు వ్యక్తిగత విశ్వాసాలు గా ఉండాలే తప్ప సమాజం లౌకిక ప్రాతిపదికన మాత్రమే ఉండాలన్నాడు. వివక్ష పూరితమైన కుల వ్యవస్థను రద్దు చేయాలని భావించాడు. అంతేకాదు సంపూర్ణ స్వాతంత్య్రం అంటే ఒక మనిషిని ఇంకో మనిషి, ఒక జాతిని ఇంకో జాతి దోపిడీ చేసే వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడమేనన్నాడు. విప్లవ భావాలతో అభ్యుదయ మార్గంలో సమసమాజ స్థాపనే మా ధ్యేయం అని దాని కోసం మరణించడానికి సైతం తాము సిద్ధం అని ప్రకటించడం ఆ రోజుల్లో చాలా పెద్ద ముందడుగు. ''విప్లవం అన్న పదానికి మీ అర్థం ఏమిటి అని కోర్టులో అడిగితే విప్లవం. అంటే మా ఉద్దేశంలో అన్యాయం మీద ఆధారపడిన ప్రస్తుత సాంఘిక. ఆర్థిక. రాజకీయ వ్యవస్థ పూర్తిగా మారిపోవాలని భగత్ సింగ్ వివరంగా చెప్పారు.
రాజ్‌గురు ఆగష్టు 24న 1908 సంవత్సరంలో మహారాష్ట్రలోని ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు.. సుఖ్‌దేవ్ మే 15న 1907 సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా అనే ప్రాంతంలో జన్మించారు.
బ్రిటిష్ పోలీస్ అధికారి సాండర్స్ హత్య
1928 సంవత్సరంలో భారత రాజకీయాలను పరిస్థితులను పరిశీలించడానికి జాన్ సైమన్ ఆధ్వర్యంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించింది. దీంట్లో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడం అన్యాయం అని దీనికి వ్యతిరేకంగా లాలా లజపతి రారు ''గో బ్యాక్ సైమన్ కమిషన''్ అంటూ నిరసన తెలిపారు. నిరసన చేస్తున్న లాలా లజపతి రారు మీద ఒక్కసారిగా పోలీసు అధికారి స్కాట్ ఆధ్వర్యంలో విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కొట్టారు తీవ్ర గాయాలు కావడంతో నెలరోజుల్లో లాలా లజపతి రారు కోలుకోలేని పరిస్థితిలో మరణించారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని భగత్సింగ్ ప్రభతులు నిర్ణయించారు. బ్రిటీష్ పోలీసు అధికారి స్కాట్ ను చంపాలని నిర్ణయించారు. సరైన సమాచారం లేక పొరపాటున సాండర్స్ అనే పోలీసు అధికారిని చంపి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేశారు. ఇది 1928 డిసెంబర్ 17న జరిగింది.
సెంట్రల్ అసెంబ్లీ పై బాంబుల దాడి
1929 ఏప్రిల్ 8న రెండు బిల్లులు ఆమోదానికి పెట్టారు అందులో ఒకటి పౌర హక్కులను హరించే చట్టం. రెండవది కార్మిక హక్కులను హరించే చట్టం. ఈ రెండు చట్టాలను ఆమోదించడం కోసం కేంద్ర శాసన సభ లో ప్రెసిడెంట్ లేవగానే భగత్‌సింగ్ బటుుకేశ్వర్ దత్ చేరొక బాంబు జనాలు లేని చోట విసిరారు దాంతో పాటు ఎర్రటి అక్షరాలు గల కరపత్రాలు విసిరి ''ఇంక్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్యవాదం నశించాలి, కార్మికవర్గం వర్ధిల్లాలి'' అంటూ నినాదాలు చేసి తమ నిరసన తెలిపారు. తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ, కావాలనే దొరికపోయారు. ి కోర్టును, పత్రికలను తమవాణనిి వినిపించాడానికీ వేదికలుగా ఉపయోగించుకోవాలని అనుకున్నారు. ఆ కేసులో యావజ్జీవ శిక్ష పడింది. ఇదే తరుణంలో సాండర్స్ కేసులో ప్రధాన నిందితులుగా చేర్చి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. క్షమాభిక్ష కోరితే వదిలేస్తాం అని బ్రిటిష్ ప్రభుత్వం చెప్పినా భగత్‌సింగ్ సహచరులు అందుకు అంగీకరించలేదు.
భగత్‌సింగ్ తండ్రి కిషన్‌సింగ్ భగత్‌సింగ్‌ను ఉరిశిక్ష నుంచి కాపాడుకోవడం కోసం స్పెషల్ ట్రిబ్యునల్ పిటిషన్ పెట్టుకున్నట్లు తెలుసుకున్న భగత్ సింగ్ తీవ్రంగా స్పందించాడు. '' మీ స్థానంలో ఇంకొకరు ఉంటే తీవ్రమైన బాష వాడే వాడిని'' అంటూ ''ఆశయం కన్నా సిద్ధాంతం కన్నా నేను గొప్పవాన్ని కాదు'' అన్నాడు భగత్‌సింగ్. ''విప్లవ పోరాటంతో కూడిన ఈ కొద్దిపాటి జీవితం ఒక్కటే నాకు గొప్ప బహుమానం'' అన్నాడు భగత్‌సింగ్.
వారి మరణం కూడా పాలకులను వణికించింది
వాస్తవానికి భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లను ఉరి వేయాల్సింది మార్చి 24న కానీ ఒక రోజు ముందే, అది కూడా సాయంత్రం పూట లాహౌర్ సెంట్రల్ జైలులో ఉరి తీశారు. చనిపోయిన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్ దేవ్ శవాలు చూసి బ్రిటిష్ ప్రభుత్వం గజగజ వణికింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శవాలను కనిపించకుండా చేయాలని హుస్సేన్ వాల గ్రామంలో సట్లెజ్ నది ఒడ్డున ఎవరికి తెలియకుండా రహస్యంగా దహనం చేశారు.
భగత్ సింగ్ బాటలో పయనిద్దాం
పురోగతికి నిలబడ్డ ఏ మనిషైనా పాత విశ్వాసాలను, భావాలను విమర్శించాలి, అవసరమైతే ప్రతి అంశాన్ని సవాల్ చేయాలి అంటాడు భగత్‌సింగ్. నేడు యువత దీన్ని ఆచరణలో పెట్టాలి.
నేడు సామ్రాజ్యవాద దోపిడీ ప్రపంచీకరణ. ప్రైవేటీకరణ. కార్పోరేటికరణ. విధానాలను వేగవంతంగా అమలుచేయటం ద్వారా మనిషికి మనిషికి మద్య వ్యాపార సంబంధం తప్ప ఇంకేమీ మిగల్చలేదు. మరోవైపు కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం రెచ్చగొట్టి పాలకులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో భగత్ సింగ్ జీవితాన్ని రచనలను మనం ఒక్క సారి చదవాల్సిన అవసరం ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నేడు మితవాద శక్తులు రాజ్యంలోకి వచ్చి రాజ్యాంగ వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మార్చేశాయి ఎమీ తినాలో ఏ బట్టలు వేసుకోవాలో ఆక్తులే నిర్ణయించే పరిస్థితి నేడు దేశంలో ఏర్పడింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులు అని ముద్ర వేసే ధోరణితో నేటి పాలకులు నాటి బ్రిటిష్ దమననీతిని గుర్తుకు తెస్తున్నారు. ఆనాటి త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్య్రమే నేడు ప్రమాదంలో పడుతోంది. కనుక మళ్ళీ ఆనాటి త్యాగాల స్ఫూర్తితో మనం మరో స్వాతంత్య్రపోరాటానికి సిద్ధం కావాలి. అందుకు భగత్‌సింగ్, సుఖదేవ్, రాజగురు ల త్యాగాలు ప్రేరణ కావాలి.
నాటి బ్రిటిష్ పాలకులకే కాదు, నేటి హిందూత్వ-ఆరెస్సెస్ పాలకులకు సైతం భగత్‌సింగ్ జీవితం, పోరాటస్ఫూర్తి సింహస్వప్నంగానే ఉన్నాయి. అందుకే మోడీ ప్రభుత్వం జాతీయోద్యమ చరిత్రనే వక్రీకరించేందుకు పూనుకుంటోంది. ప్రాణం పోయినా క్షమాభిక్ష కోరేది లేదన్న ధీరోదాత్తుడైన భగత్ సింగ్ జీవితాన్ని బోధించేబదులు. జైలుశిక్షకే భయపడి పదే పదే బ్రిటిష్ పాలకులకు క్షమాభిక్ష అర్ధిఇంచిన సావర్కర్‌ను గొప్ప యోధుడిగా చిత్రీకరించే తప్పుడు ప్రయత్నాఇనిక పూనుకున్నది ఈ ప్రభుత్వం. జాతిపిత గాంధీ కన్నా ఆ మహాత్ముడిని హత్య చేసిన గాడ్సేను గొప్పగా పరిగణించే విధంగా చరిత్రను తిరగరాస్తున్నారు. ఈ దుర్మార్గపు యత్నాలను మనం తిప్పికొట్టాలి. భగత్‌సింగ్ ఆశయాలను సమున్నతంగా నిలపాలంటే ఈ చరిత్ర వక్రీకరణలను ఎండగట్టి నిరోధించాలి.
మన కర్తవ్యం
స్వాతంత్య్రోద్యమంలో మన అమరవీరులు త్యాగం చేసింది మనకు స్వాతంత్య్రం సాధించి పెట్టింది మన కాళ్ళ పై మనం నిలబడాలని. కాని మన పాలకులు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మనల్ని తాకట్టు పెట్టారు.
శ్రీశ్రీ చెప్పిన ముందుతరం దూతలు కావాలి పావన నవజీవన బందావన నిర్మాతలు కావాలి. అందుకే భగత్‌సింగ్ స్పూర్తితో విచ్చిన్నకర శక్తులకు వ్యతిరేకంగా యువత ముందుకు రావాలి.
ఇప్పటికైనా కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్ లాంటి స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు చర్యలు తీసుకోవాలి. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల నిజమైన వారసులంటే సామ్రాజ్యవాద, మతోన్మాద వ్యతిరేక పోరాట వారసత్వాన్ని కొనసాగించటం. ఇటువంటి మహత్తర బాధ్యతను నేటి యువతరం స్వీకరించి ముందుకు సాగుదాం.
ఇంక్విలాబ్ జిందాబాద్.
డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు
9177590726
జి. రామన్న











