ప్రజాశక్తి- యంత్రాంగం
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు యోధుడు జ్యోతి బసు జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని వక్తలు కొనియాడారు. అనకాపల్లి, విశాఖ జిల్లాలో పలు చోట్ల మంగళవారం జోతిబసు వర్థంతి కార్యక్రమాలు నిర్వహించారు.
కలెక్టరేట్, విశాఖ: సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు మార్గమే ఈ దేశానికి సరైనదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం అన్నారు. సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యాన జ్యోతిబసు 13వ వర్థంతిని మంగళవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిర్వహించారు. ముందుగా జ్యోతిబసు చిత్రపటానికి లోకనాథం, జిల్లా కమిటీ సభ్యులు పి.మణి, ఎం.సుబ్బారావు, వి.నరేంద్ర కుమార్, డి.అప్పలరాజు, జివిఎన్.చలపతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లోకనాథం మాట్లాడుతూ, భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన జ్యోతిబసు పార్టీని బలోపేతం చేయడంలో, సంపూర్ణ స్వాతంత్ర ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కోల్‌కతా రైల్వే కార్మికుల యూనియన్ నాయకునిగా బాధ్యతగా వ్యవహరించి కార్మిక హక్కుల కోసం అనేక సమ్మెలు, పోరాటాలు నిర్వహించారని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో 1977 నుంచి 2000 వరకు 23 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారన్నారు. వ్యవసాయ రంగంలోనూ, ఉపాధి కల్పనలోను అభివృద్ధి సాధించారని తెలిపారు. పారిశ్రామిక దశకు వెళ్లేసరికి తృణమూల్ కాంగ్రెస్ రైతులను రెచ్చగొట్టి వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసిందని విమర్శించారు. జ్యోతిబసు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందన్నారు. యువతకి ఉపాధి కల్పన, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో విఫలమైందన్నారు. 33 ఏళ్ల పాలనలో అవినీతిలేని పాలన సిపిఎం అందిస్తే, నేడు అవినీతి, దౌర్జన్యంతో కూడిన పాలన సాగుతోందన్నారు. పేదల పక్షాన నిలబడుతున్న ఎర్రజెండా కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ పెద్ద ఎత్తున దాడికి పూనుకున్నాయని తెలిపారు. నేడు భారతదేశంలో మోడీ ప్రభుత్వం పేద రైతులకు భూములు పంపిణీ చేయకుండా, ఉన్న భూములను లాక్కొని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం వల్ల వ్యవసాయరంగం పూర్తిగా నాశనం అవుతుందన్నారు. దోపిడీ రాజ్యం పోయి, ఎర్ర జెండా అధికారంలోకి వస్తేనే దేశం అభివృద్ధి జరుగుతుందని జ్యోతిబసు నమ్మిన సిద్ధాంతం అని, ఆ సిద్ధాంతానికి కట్టుబడి సిపిఎం కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.వెంకటరావు, కె.కుమారి, ఎం.సూరీడు, వై.రాజు, దండు నాగేశ్వరరావు, పి.శంకరావు తదితరులు పాల్గొన్నారు.
బెంగళూరులో సిఐటియు జాతీయ మహాసభలకు హాజరైన డెలిగేట్స్ మంగళవారం ఆర్‌కెఎస్‌వి కుమార్ అధ్యక్షతన జ్యోతిబసు వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ఎపి రాష్ట్ర కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ మాట్లాడుతూ, జ్యోతిబసు కార్మిక వర్గానికి స్ఫూర్తి ప్రధాత అన్నారు. ఆయన చేసిన పోరాటాలు ఫలితంగా కార్మిక చట్టాలు అనేవి రక్షింపబడ్డాయన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌వి.నరసింహులు మాట్లాడుతూ, కార్మికులు తన హక్కుల కోసం పోరాడి జ్యోతిబసు ఆశయాలను నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తేజ, జగన్, లక్ష్మణమూర్తి, చంద్రమౌళి, అనసూయ, రత్నం తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి :
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ జ్యోతి బసు జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వివి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక దొడ్డి రామునాయుడు భవనంలో మంగళవారం జ్యోతి బసు 13వ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జ్యోతిబసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం అగ్ర నేతగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా దేశంలోనే ఆదర్శవంతమైన నేతగా జ్యోతి బసు పేరు తెచ్చుకున్నారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కార్మిక కర్షకవర్గం కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు. జ్యోతి బసు మరణానంతరం కూడా ఆయన పార్థివ దేహాన్ని కల్‌కతా వైద్య కళాశాలకు ఇచ్చి తమ ఆదర్శాన్ని నిరూపించుకున్నారన్నారు. తన రాజకీయ జీవితంలో ప్రధానమంత్రి పదవి వచ్చిన పార్టీ ఆదేశాల మేరకు తృణప్రాయంగా త్యజించి మచ్చలేని నాయకునిగా నిలిచారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో విశాఖ కేంద్రంగా జ్యోతి బసు దేహ దారణ ప్రోత్సాహక సంస్థ ఏర్పాటు చేసి 13 ఏళ్లుగా విశాఖ ఆంధ్ర మెడికల్ కళాశాలకు కమ్యూనిస్టులు, వారి కుటుంబాలు కార్యకర్తలు, అభ్యుదయ వాదులు మరణానంతరం వారి దేహాలను దానం చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం కార్యదర్శి ఎ.బాలకృష్ణ, వత్తిదారుల సంఘం నాయకులు గంట శ్రీరామ్, సిఐటియు నాయకులు తేలయ్య బాబు, బి ఉమామహేశ్వరరావు, ఎం నాగేశ్వరరావు, బి నూక అప్పారావు, ఈశ్వరరావు, ఎం అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
పరవాడ : ఫార్మాసిటీలో మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో జ్యోతి బసు 13వ వర్ధంతి నిర్వహించారు. జ్యోతి బసు చిత్రపటానికి సిఐటియు నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ రైల్వే కార్మికుల సమస్యలపై జ్యోతిబసు అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. భారతదేశంలో అనేక కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించిన జ్యోతి బసు చూపించిన బాటలో కార్మిక వర్గం ప్రయణించాలని గనిశెట్టి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కర్రి ఎంకునాయుడు, కర్రి పెంటారావు, కె.కృష్ణ, పి అప్పారావు, ఏ రాజు తదితరులు పాల్గొన్నారు.










