Jan 09,2023 22:50

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌
సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, నాస్తికుడు, హేతువాది మానవతావాది,ó రావూరి అర్జున్‌రావు నేటి తరానికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారి అజరు కల్లం అన్నారు. రావూరి అర్జున్‌రావు సంస్మరణ సభ సోమవారం బెంజ్‌సర్కిల్‌ వద్ద గల వేదిక ఫన్‌క్షన్‌ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మగాంధీ, గోరా సిద్దాంతాలకు ఆకర్షితులై తాను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడిన మహోన్నత వ్యక్తి రావూరి అర్జున్‌రావు అని కొనియాడారు. నాస్తిక జీవన విధానంలో పయనిస్తూ సమాజంలో కులమతాల అసమానతలను రూపుమాపటంలో రావూరి రాజీలేని పోరాటం చేశారన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, సంస్కరణలకు మారు పేరైన అర్జున్‌రావు నేటి తరానికి ఆదర్శపాయంగా నిలుస్తారన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా మారుమూలల గ్రామంలో నాస్తిక కేంద్రాన్ని స్థాపించి కుల మత వర్గ బేధాలు అంటారాని తరం మూఢ విశ్వాసాలు, దురాచారాలపై ఉక్కుపాదం మోపి పోరాటం చేస్తున్న గోరా, సరస్వతి గోరా దంపతులకు బాటలో పయనించి వారి ఆశ్రయాలను భాగస్వాములు కావడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ సలహదారి జివిడి కృష్ణమోహన్‌ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు సమానమేనని, ప్రకృతి అందించే వనరులు అందరికి సమానంగా అందించాలనే భావం రావూరి మనస్సులో బలంగా వుండేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణువర్థన్‌, సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్‌రావు, ప్రముఖ వైద్యులు జి.సమరం, మార్పు ట్రస్ట్‌ డైరెక్టర్‌ రావూరి సూయజ్‌, ఏలూరు సెయింట్‌ థెరిస్సా కళాశాల ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషినిస్ట్‌ హెచ్‌వోడి పద్మజ, రావూరి కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.