ప్రజాశక్తి -సీలేరు
జీకే వీధి మండలం సీలేరులో పంపు స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణంపై ఏప్రిల్ 1న జరగనున్న ప్రజా అభిప్రాయ సేకరణకు స్థానిక క్రీడా మైదానంలో ఏపీ జెన్కో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. వేదిక ప్రాంగణం పరిసరాల్లో కర్రలతో బారికేట్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. సుమారు 20 గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రజా అభిప్రాయానికి హాజరుకానున్న తరుణంలో వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీరు, వైద్యం తదితర వసతులను ఎన్విరాన్మెంట్ వింగ్ ఈఈ సివిల్ రత్నకుమార్, ఏడిఈ పైడిరాజు పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లును ఎస్‌ఇ సివిల్ కేకేవి.ప్రశాంత్ కుమార్, ఈఈ ప్రభాకర్, ఏడిఇ అప్పలనాయుడు, ఏఈ సురేష్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సుమారు 2500 మంది కార్యక్రమానికి హాజరవుతున్న తరుణంలో వారికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ సభా ప్రాంగణాన్ని శుక్రవారం పరిశీలించారు.
జెఎసి నాయకులతో ఎస్‌ఐ చర్చలు
పంపు స్టోరేజ్ ప్రాజెక్టుపై శనివారం ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న నేపథ్యంలో జేఏసీ నాయకులను పోలీసు స్టేషన్‌కు పిలుపించుకొని ఎస్సై రామకృష్ణ వారితో పలు అంశాలపై చర్చించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకించకుండా సామరస్యంగా మీ సమస్యలను అధికారుల ముందు ఉంచాలని జెఎసి నాయకులకు ఎస్సై సూచించారు. ప్రజా అభిప్రాయ సేభకరణ శాంతియుతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.










