Aug 16,2023 00:25

కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి నాగరాజుకు నోటీసు ఇస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-గుంటూరు : విద్యుత్‌ ఉద్యోగులకు తిరోగమన వేతన ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆగస్టు 16, 17, 18 తేదీల్లో ప్రతి విద్యుత్‌ కార్యాలయం వద్ద నిరసనలు తెలియజేయాలని జిల్లా విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ స్ట్రగుల్‌ కమిటీ నాయకులు సిహెచ్‌ నాగబ్రహ్మాచారి, దాసరి వెంకటేశ్వరరావు, గురుబ్రహ్మం, బి.లక్ష్మణరావు, జి.నాగరాజు, జి.పవన్‌ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఉద్యోగుల వేతనాలు పెంచకుండా తగ్గించే విధానాన్ని అవలంబిస్తోందని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంట్రాక్ట్‌ కార్మికులకు తీవ్ర ద్రోహం చేశారని, జెఎల్‌ఎం గ్రేడ్‌-2లకు ఎపిఎస్సీబిల సర్వీసు రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని కోరారు. 17న చలో విద్యుత్‌ సౌధకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా నాయకులకు పోలీసులు నోటీసులు ఇవ్వటాన్ని స్ట్రగుల్‌ కమిటీ నాయకులు ఖండించారు. కార్యక్రమంలో పాల్గొంటే ఎస్మా చట్టం ప్రయోగిస్తామని, క్రిమినల్‌ కేసులు పెడతామని బెదిరించటం, విజయవాడలో 144 సెక్షన్‌ అమలు చేయటం వంటివి ప్రభుత్వ నియంతృత్వ విధానానికి నిదర్శమని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం విద్యుత్‌ ఉద్యోగులపై నిర్బంధం మానుకొని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.