
ప్రజాశక్తి - మంగళగిరి : మంగళగిరి నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా చైతన్య పాదయాత్ర మంగళవారం ఉదయం 9 గంటలకు ఉండవల్లిలో ప్రారంభమవుతుందని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. పాదయాత్రను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గపూర్ ప్రారంభిస్తారని చెప్పారు. ఈ మేరకు సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. 12వ తేదీ వరకూ కొనసాగే పాదయాత్రకు ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా బృందం దృష్టికి తేవాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం 16న మంగళగిరిలోని కార్పొరేషన్ కార్యాలయం వద్ద, తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా ఉంటుందని, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో 20 వేలకుపైగా పేద కుటుంబాలు వివిధ స్థలాల్లో ఇళ్లేసుకుని నివాసం ఉంటున్నాయని, వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో పారిశుధ్య కార్మికుల వేతనాలు ప్రతినెల సక్రమంగా ఇవ్వాలని, పెరుగుతున్న అవసరాలకు తగిన విధంగా సిబ్బందిని పెంచాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్ చెంగయ్య మాట్లాడుతూ మంగళగిరి పట్టణంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, తాగునీటిని కూడా అందించలేని స్థితిలో కార్పొరేషన్ ఉందని విమర్శించారు. సీనియర్ నాయకులు జెవి రాఘవులు మాట్లాడుతూ నియోజకవర్గంలో అసైన్డ్ భూముల వివరాలను ప్రభుత్వం తెలియజేయడం లేదన్నారు. మున్సిపాలిటీలకు, పంచాయతీలకు ఎన్నికలు లేకపోవడం వలన అనేక నిధులు నిలిచిపోయాయని అన్నారు. ఇక్కడ పరిపాలనంతా ఎమ్మెల్యే ఆర్కే కనుసన్నల్లో జరుగుతోందని విమర్శించారు. సమావేశంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, సీనియర్ నాయకులు పి.బాలకృష్ణ, ఎం.పకీరయ్య పాల్గొన్నారు.
పాదయాత్ర షెడ్యూల్
మంగళవారం ఉదయం 9 గంటలకు ఉండవల్లి సెంటర్లో ప్రారంభం. ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణ నగర్ ప్రాంతాల్లో పర్యటన. 4న ముగ్గురోడ్డు, కృష్ణుడు గుడి సెంటర్, బోసు బొమ్మ సెంటర్, కెఎల్ రావు కాలనీ, సీతానగరం, మహానాడు, సుందరయ్య నగర్‌లో పాదయాత్ర. 5. క్రిస్టియన్‌పేట, అమరారెడ్డి కాలనీ, మదర్ థెరిస్సా కాలనీ, కుంచనపల్లి, ప్రాతూరులో పర్యటన. 6న గుండిమెడ, చిర్రావూరు, నూతక్కి, మెల్లంపూడి, కొలనుకొండలో యాత్ర. 7న వడ్డేశ్వరం, ఇప్పటం, ఆత్మకూరు, పెదవడ్లపూడి, రేవేంద్రపాడు, శృంగారపురం, పెదపాలెం వరకు పాదయాత్ర. 8న పేరకలపూడి, సుక్కపల్లివారిపాలెం, తాడిబోయిన వారిపాలెం, ఈమని, దుగ్గిరాల, మంచికలపూడిలో పర్యటన. 9న తుమ్మపూడి, చిలువూరు, కాజా, చినకాకాని, 10న మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు, పాత మంగళగిరి, మెయిన్ రోడ్డు, విజెడి డిఎల్‌బి కాలేజీ వరకూ పాదయాత్ర. 11న కొండ ప్రాంతం, మూడో వార్డు, విజె డిగ్రీ కాలేజీ వరకు, 12న నవులూరు, బేతపూడి, కురగాల్లు, నిడమర్రు వరకు కొనసాగింపు, ముగింపు సభ.