ప్రజాశక్తి - పెదనందిపాడు, తాడేపల్లి : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 14 నుండి 24 వరకు దేశ వ్యాప్తంగా జరిగే దేశ రక్షణ భేరి ప్రచారాన్ని, 24న విజయవాడ జింఖానా మైదానంలో బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రజలను సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. ఈ మేరకు కరపత్రాలను గుంటూరు జిల్లా పెదనందిపాడులోని పాత బస్టాండ్ సెంటర్‌లో మంగళవారం ఆవిష్కరించి ప్రచారాన్ని ప్రారంభించారు. తాడేపల్లి పట్టణంలోని సుందరయ్యనగర్‌లో ప్రచారాన్ని ప్రజాశక్తి బుకహేౌస్ ఎడిటర్ ఎస్.వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాశం రామారావు, ఎస్.వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలులో దగా చేసిన మోడీ సర్కారును నిలదీయాలని పిలుపునిచ్చారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోడీ అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నారని విమర్శించారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను ధ్వంసం చేస్తూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటస్ఫూర్తితో ప్రజలు ఎక్కడికక్కడ ఉద్యమించి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. నిత్యావసర ధరలు తగ్గించాలని, రేషన్ డిపోల ద్వారా నాణ్యమైన సరుకులివ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని, పంటలకు మద్దతు ధరలకు చట్టం చేయాలని, రుణ విమోచన చట్టం తేyలని, ఉపాధిహామీ పని దినాలను 200 రోజులకు పెంచి రోజు కూలి రూ.600 ఇవ్వాలని, పట్టణ ఉపాధిహామీ చట్టాన్ని తేవాలని, పెంచిన ఆస్తి పన్ను తగ్గించాలని, చెత్త పన్ను రద్దు చేయాలని తదితర సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం చేపట్టిన దేశ రక్షణభేరీని జయప్రదం చేయాలని కోరారు. పెదనందిపాడులో సిపిఎం నాయకులు కె.నాగేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, డి.శ్రీనివాసరావు, సుందరయ్య నగర్‌లో కె.కరుణాకరరావు, పి.గిరిజ, కె.ఉషారాణి పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సమావేశం నిర్వహించగా 18-23 తేదీల్లో దేశ రక్షణభేరీ ప్రచారం ఉంటుందని, కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఎం సీనియర్ నాయకులు గద్దె చలమయ్య, పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్ కోరారు.










