
ప్రజాశక్తి -యంత్రాంగం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం నుంచి సిపిఎం, సిపిఐ చేపట్టే ప్రచార భేరి కార్యక్రమాల పోస్టర్లను గురువారం పలుచోట్ల ఆవిష్కరించారు.
అనకాపల్లి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు, మతతత్వానికి నిరసనగా సిపిఎం సిపిఐ సంయుక్తంగా ఈనెల 14 నుంచి 30 వరకు నిర్వహించనున్న ప్రచార భేరి పోస్టర్లను గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఇరు పార్టీల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థ సేవలో మునిగి తేలుతూ, ప్రభుత్వ రంగాన్ని వారికి ధారాదతం చేస్తుందని, సామాన్యులపై విపరీతమైన భారాలు మోపుతుందని తెలిపారు. వాటిపై ప్రజలు ప్రశ్నించకుండా మతం పేరుతో విధ్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. మరో వైపు రాష్ట్ర విభజన హామీలను తుంగలో తొక్కి రాష్ట్రానికి ద్రోహం చేసిందన్నారు. ఈ విధానాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రచార భేరి నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ఎ.బాలకృష్ణ, జిల్లా నాయకులు వివి శ్రీనివాసరావు, అల్లు రాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు, పట్టణ కార్యదర్శి వైఎన్ భద్రం, నాయకులు గొర్లి దేముడు బాబు, వి కన్నబాబు, నరాలశెట్టి సత్యనారాయణ, ఇల్లా రాము, పోతురాజు, సూరిబాబు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : మండలంలోని తిమ్మరాజుపేట గ్రామంలో సిపిఎం, సిపిఐ ప్రచార భేరి వాల్ పోస్టర్లను సిపిఎం అచ్యుతాపురం డివిజన్ కన్వీనర్ ఆర్.రాము తదితరులు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ అండదండలతో అదాని ఏ విధంగా లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడో హిండేన్ బర్గ్ నివేదిక బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తిమ్మరాజుపేట శాఖ కార్యదర్శి ఎస్ రామునాయుడు, నాయకులు బుద్ధ రంగారావు, కె రామసదాశివరావు, కర్రి అప్పలనాయుడు, నూకరాజు, మల్ల నాయుడు పాల్గొన్నారు.
కె.కోటపాడు : 'బిజెపిని సాగనంపుదాం.. దేశాన్ని కాపాడుకుందాం' అనే నినాదంలో జరుగు ప్రచార భేరి కార్యక్రమం వాల్ పోస్టర్‌ను స్థానిక సిఐటియు కార్యాలయంలో గురువారం సిపిఎం, సిపిఐ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు గండి నాయన బాబు, సిపిఐ మండల నాయకులు గొర్రె దేవుడు బాబు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజల ఉమ్మడి సంపదగా ఉన్న బ్యాంకులను, ప్రభుత్వ రంగ సంస్థలను, అన్నం పెట్టే వ్యవసాయాన్ని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎర్ర దేవుడు. వనము సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తగరపువలస : ప్రచార భేరి కార్యక్రమాలను ప్టోస్టర్‌ను సిపిఎం, సిపిఐ నాయకులు ఆర్‌ఎస్‌ఎన్.మూర్తి, అల్లు బాబూరావు గురువారం సిపిఐ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకులు రవ్వ నరసింగరావు, ఎస్.అప్పలనాయుడు, కానూరు రాంబాబు, అప్పలరాజు, ఎ.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
గాజువాక : గాజువాక సిపిఎం కార్యాలయంలో ప్రచార భేరి పోస్టర్‌ను సిపిఎం, సిపిఐ నాయకులు ఎం.రాంబాబు, కసిరెడ్డి సత్యనారాయణ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వామ పక్ష పార్టీలు ప్రచార ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వామ పక్ష పార్టీల నాయకులు శ్రీనివాసరాజు, బైరెడ్డి గుర్రప్ప, లోకేశ్వరరావు, జి.ఆనంద్, కె.అచ్యుతరావు, తాండ్ర కనకరాజు, అప్పారి విష్ణుమూర్తి, వై.లక్ష్మణరావు, హాసన్ తదితరులు పాల్గొన్నారు.