
నేటి నుండి దసరా మహోత్సవాలు
ప్రజాశక్తి - శ్రీశైలం
శ్రీశైల క్షేత్రంలో నేటి నుండి దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. ఉత్సవాలు 15వ తేదిన ప్రారంభమై 24న ముగుస్తాయి. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామి వారికి విశేష అర్చనలు, అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు ప్రతి రోజూ నిర్వహిస్తారు. ప్రతిరోజు స్వామి అమ్మవార్ల ఉత్సవం, బ్రహ్మౌత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 15వ తేదీన శైలపుత్రి అలంకారంలో అమ్మవారు, భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. 16న బ్రహ్మచారిని అలంకారంలో అమ్మవారు, మయూరి వాహనంపై స్వామి అమ్మవార్లు, 17న చంద్రఘంట అలంకారంలో అమ్మవారు, రావణ వాహనంపై స్వామి అమ్మవార్లు, 18న కుష్మాండ దుర్గా అలంకారంలో అమ్మవారు, కైలాస వాహనంపై స్వామి అమ్మవార్లు, 19న స్కందమాతగా అమ్మవారు, శేష వాహనంపై స్వామి అమ్మవార్లు, 20న కాత్యాయినిగా అమ్మవారు, హంస వాహనంపై పుష్ప పల్లకీ సేవలో స్వామి అమ్మవార్లు దర్శనమిస్తారు. 21న కాలరాత్రి అలంకరణలో అమ్మవారు, గజ వాహనంపై స్వామి అమ్మవార్లు, 22న మహాగౌరీగా అమ్మవారు, నంది వాహనంపై స్వామి అమ్మవార్లు, 23న సిద్ధిధాయనిగా అమ్మవారు, అశ్వ వాహనంపై స్వామి అమ్మవార్లు, 24న భ్రమరాంబ దేవి నిజాలంకరణ, నంది వాహనంపై ఆలయ ఉత్సవం స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ గ్రామోత్సవంలో అన్ని రకాల కోలాటం, చెక్కభజన, జానపద నృత్యాలు వంటివి దేవస్థానం ఏర్పాటు చేసింది. ఈ ఉత్సవాలలో స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని భక్తులకు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి పెద్దిరాజు సూచించారు.