Jun 11,2023 23:39

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : మండుటెండలు, వేడిగాలుల మధ్య ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలు సోమవారం నుంచి పున: ప్రారంభం కానున్నాయి. ఈనెల 12 నుంచి 17 వరకు ఉదయం 7.30 గంటల నుంచి 12 గంటలవరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల నిర్వాహకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది రోహిణీ కార్తె ముగిసి వారం అవుతున్నా ఇంత వరకు మండుటెండలు తగ్గలేదు.వడగాల్పులు కొనసాగుతున్నాయి. వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఉదయం 10 గంటల నుంచి వేడిగాలులు ఉధృతం అవుతున్నాయి. ఇప్పటికీ 42నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. సోమ వారం కూడా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ నేపధ్యంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత విద్యా సంస్థల నుంచి విద్యార్థులు ఇళ్లకు వెళ్లాలంటే వడగాల్పుల బారిన పడక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. సాయంత్రం వరకు పాఠశాలను కొనసాగించి మధ్యాహ్న భోజనం, ఇతర శీతల పానియాలు అందించి ఉంటే బాగుండేదని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత విద్యార్థులకు ఇళ్లకు తీసుకు వెళ్లడానికి తల్లిదండ్రులు ఎండలోనే పాఠశాలల వద్దకు రావాల్సి ఉంది. ఒక ఊరునుంచి మరొక వూరుకు బస్సులో వెళ్లే విద్యార్థులు కూడా వడగాలి బారినపడే ప్రమాదం లేకపోలేదంటున్నారు. ఎండల తీవ్రత ను దృష్టిలో పెట్టుకుని శెలవులను మరో 10 రోజులు పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాల వినతిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.
నేటి నుంచి హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చేరికలు
చాలా ఏళ్ల తరువాత విద్యా సంవత్సరం ప్రారంభంకు ముందే బదిలీల ప్రక్రియ ముగించారు. అయితే ఈ ప్రక్రియ మరికొద్దిరోజుల ముందు ముగించి ఉంటే బాగుండేదని కానీ ఈనెల 10 వతేదీ రాత్రి వరకు కొనసాగించారని ఉపాధ్యాయులు వాపోయారు. బదిలీల ఉత్తర్వులు చాలా మందికి శని, ఆదివారాల్లో అందాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని కేడర్లలో కలిపి 3350 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. వీరిలో 285 మంది ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. ఇప్పటికే ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న 243 మందితో పాటు సీనియర్‌ అసిస్టెంట్‌లుగా పనిచేస్తున్న మరో 42 మంది ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతిపొందారు. మొత్తంగా 285 పాఠశాలలకు కొత్త ప్రధానోపాధ్యాయులు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. వివిధ కేటగిరిలో 2938 మంది రిక్వెస్టు బదిలీలు కోరుకున్నారు. వీరిలో దాదాపు వెయ్యి మంది వరకు బదిలీ అయ్యారు.
మండలాలకు చేరని పాఠ్యపుస్తకాలు
జెవికె కిట్లతోపాటు పాఠ్యపుస్తకాలు కూడా కలిపి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఒకపండగలా చేయాలని డిఇవోలు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌లను ఆదేశించింది. ఉమ్మడి జిల్లాకు 30 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా 28 లక్షలు వచ్చినట్టు చెబుతున్నారు. కానీ కొన్ని సజ్జెక్టుల పుస్తకాలు రాలేదని చెబుతున్నారు. జిల్లాకు వచ్చిన పుస్తకాలు ఇంకా మండల కేంద్రాలకు కూడా చేరలేదు. ఈనెలాఖరు వరకు జెవికె కిట్ల పంపిణీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాకు ఆరున్నర లక్షల వరకు జెవికె కిట్లు అవసరం కాగా ఇంకా నాలుగు లక్షలు మాత్రమే జిల్లాలకు వచ్చాయని సమాచారం.