Jul 30,2021 00:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సినిమా థియేటర్లలో శుక్రవారం నుంచి బమ్మ పడనుంది. అయితే మొత్తం థియేటర్లు కాకుండా 10శాతం మాత్రమే ప్రారంభం కానున్నాయి. 50శాతం సీట్లతో శుక్రవారం విడుదల కానున్న తిమ్మరుసు, ఇష్క్‌ సినిమాలను ప్రదర్శించనున్నారు. సినీ ఎగ్జిబిటర్లు విజయవాడలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 35వ నెంబర్‌జిఓపై ప్రధానంగా చర్చ సాగింది. నిత్యావసర వస్తువులు ధరలు భారీగా పెరుగుతుంటే రూ.5, 10లతో సినిమా చూపించాలని ప్రభుత్వం చెబుతోందని, దీనివల్ల నష్టాలు వస్తాయని ఎగ్జిబిటర్లు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలు వల్ల రోజుకు మూడు ఆటలే ప్రదర్శించాల్సివస్తుందని, ఆ సమయాన్ని కూడా మార్చాలని కోరారు. ప్రస్తుత పరిస్థితులలో చిత్రాలు ప్రదర్శిస్తే ఎదురు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.