Mar 06,2023 23:07

ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు: శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల ఉత్సవాలు మంగళవారం నుండి ప్రారంభం కానున్నాయి. 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు మంగళవారం అఖండ జ్యోతి స్థాపన, రెండోవ రోజు బుధవారం రాత్రి శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి గ్రామోత్సవం (రధోత్సవం), మూడో రోజు గురువారం ఉత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పుట్టినిల్లు అయిన అనిగండలపాడు గ్రామ నుంచి అమ్మవారి ఆలయానికి భారీ ఊరేగింపులతో పుట్టింటి పసుపు కుంకుమ మహోత్సవం, నాలుగో రోజు శుక్రవారం అమ్మవారి దివ్య ప్రభోభోత్సవం, ఐదవ రోజు శనివారం బోనాలు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఆలయం వద్ద వివిధ రకాల సాంస్కతిక కార్యక్రమాలు, యువకులను ఉత్సాహపరిచేందుకు ఎగ్జిబిషన్‌ వంటి కార్యక్రమాలు ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆలయాన్ని రంగురంగుల విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఇఒ లీలా కుమార్‌, చైర్మన్‌ చెన్న కేశవరావు తెలిపారు.