Aug 09,2023 00:13

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె ప్రభావం ముందస్తుగానే కన్పిస్తుంది. బుధవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్‌ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి ఉద్యోగులు ఎక్కడికక్కడ విధులకు దూరంగా ఉన్నారు. పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో రాత్రి 8 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దుగ్గిరాల, పెదనందిపాడు, కాకుమాను తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వోల్టేజి సమస్య వచ్చింది. అయితే ప్రజలనుంచి విద్యుత్‌ కార్యాలయాలకు భారీగా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నా ఎవ్వరూ స్పందించడంలేదు. కలెక్టర్లకు, ప్రభుత్వానికి చెప్పుకోమని విద్యుత్‌ ఉద్యోగులు బదులు ఇస్తున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ఉద్యోగులు వర్క్‌టూరూల్‌ పాటిస్తున్నారు. ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో సాంకేతిక కారణాలతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే పరిష్కరించే పరిస్థితి లేదంటున్నారు. చాలా ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతున్నట్టు సమాచారం.