May 18,2023 23:52

ఆందోళన చేపడుతున్న పారిశుధ్య కార్మికులు (ఫైల్‌ పొటొ)

ప్రజాశక్తి-పాడేరు: తమ సమస్యల పరిష్కారం కోసం అల్లూరి జిల్లా పాడేరు డివిజన్లోని ప్రభుత్వ ఆస్పత్రుల శానిటేషన్‌ కార్మికులు ఈనెల 19 శుక్రవారం నుంచి తమ విధులను బహిష్కరించి సమ్మెకు దిగుతున్నారు. ఈ నెల 3న పాడేరులో నిర్వహించిన కార్మికుల జిల్లా కమిటీ విస్తతస్థాయి సమావేశంలో పాడేరు, అరకు, చింతపల్లి, ముంచంగిపుట్టు ఆస్పత్రులలో పనిచేసే శానిటేషన్‌ కార్మికులు, అధిక సంఖ్యలో హాజరై 19 నుంచి సమ్మె చేపట్టేందుకు నిర్ణయించి ఆసుపత్రుల యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసిన సంగతి విధితమే. గత 15 రోజుల వ్యవధిలో తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కానరాక పోవడంతో కార్మికులంతా సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు పాడేరు డివిజన్లోని నాలుగు ప్రభుత్వ వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రులలో పని చేస్తున్న సుమారు 56 మంది శానిటేషన్‌ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టనున్నారు.
ఆస్పత్రుల కార్మికులు చేపట్టే సమ్మెను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎల్‌ సుందర్రావు మాట్లాడుతూ, ఆస్పత్రుల శానిటేషన్‌ కార్మికుల వేతన సమస్యల పరిష్కారంపై వైద్య విధాన పరిషత్‌ అధికారులు శ్రద్ధ చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అనేకసార్లు కార్మికుల వేతన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు. సమ్మె నోటీస్‌ ఇచ్చినప్పుడు కూడా అధికారులకు విన్నవించామని, స్పందన కరువైందన్నారు. ప్రతి కార్మికుడికి నెలకు రూ.16 వేల వేతనం చెల్లించాలని, కొన్ని ఆసుపత్రుల్లో కార్మికులకు రూ.10,700, మరికొన్ని ఆసుపత్రుల్లో 9,500 చొప్పున చెల్లిస్తున్నారని తెలిపారు. పిఎఫ్‌ ఈఎస్‌ఐ సక్రమంగా చెల్లించలేదని విమర్శించారు. నేటి నుంచి కార్మికులు చేపడుతున్న సమ్మెతోనైనా అధికారులు స్పందించి వారి వేతన సమస్యలు పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా కార్మికులకు కాంట్రాక్టు విధానం చేయాలని, వైద్య విధాన పరిషత్‌ ద్వారా జీతాలు చెల్లించి, ప్రతి ఆస్పత్రిలో సరిపడా సిబ్బందిని నియమించి కార్మికులపై పని భారం, పని ఒత్తిడి తొలగించాలని డిమాండ్‌ చేశారు. 2019 నుంచి కార్మికుల జీతాలు పెంచలేదని, ఈ నాలుగేళ్లలో అన్ని నిత్యావసర ధరలు రెట్టింపు అయ్యాయని దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి కార్మికుడికి నెలకు రూ.16000 జీతం చెల్లించాలన్నారు. ప్రతినెల సక్రమంగా వేతనాలు చెల్లించి, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.