Oct 25,2023 21:25

'సామాజిక సాధికార యాత్ర'

         అనంతపురం ప్రతినిధి : 'సామాజిక సాధికార యాత్ర' పేరుతో వైసిపి చేపట్టిన బస్సు యాత్ర నేడు అనంతపురం జిల్లాలో ప్రారంభం కానుంది. రాయలసీమ జిల్లా వ్యాప్తంగా ఈ యాత్ర సాగనుంది. జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం శింగనమల మండల కేంద్రంలోని వైఎస్‌ఆర్‌ సర్కిల్‌లో ప్రారంభమై మధ్యాహ్నాం మూడు గంటలకు బుక్కరాయసముద్రం చేరుకుంటుంది. అక్కడ అంబేద్కర్‌ సర్కిల్‌లో బహిరంగ సభను నిర్వహించనున్నారు.
హాజరు కానున్న ముఖ్య నేతలు
        రాయలసీమలో ప్రారంభమయ్యే సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభ కార్యక్రమానికి వైసిపి ముఖ్య నేతలు హాజరుకానున్నరు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ హాజరవుతున్నారు. మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పార్లమెంటు సభ్యులు నందిగామ సురేష్‌, అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య తదితరులు పాల్గొననున్నారు.
ఏర్పాట్లు సిద్ధం
      ఈ యాత్రను పెద్దఎత్తున జయప్రదం చేసేందుకు ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిలు ఏర్పాట్లను చేపట్టారు. తమ నియోజకవర్గం పరిధిలో నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుండటంతో తొలి కార్యక్రమాన్ని ఘనవిజయం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. రహదారి పొడవునా కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో ఒక రంగా బల ప్రదర్శన చేపట్టాలన్న యోచనలోనూ వీరున్నారు.
సామాజిక మద్దతు లభించేనా. ?
       ఎన్నికలు సమీస్తున్న తరుణంలో వైసిపి బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీల మద్దతు కూడగట్టేందుకు యాత్రలను చేపట్టింది. ప్రధానంగా బీసీ, ఎస్సీ జనాభా అధికంగానున్న నియోజకవర్గాలపై దృష్టి సారించింది. ఇక్కడ ఈ యాత్రల ద్వారా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేపట్టింది. సామాజిక తరగతులకు రాజకీయ ప్రాధాన్యతను కల్పించామని చెప్పే ప్రయత్నం వైసిపి చేపడుతోంది. అయితే సామాజిక ప్రాధాన్యత కేవలం రాజకీయ పదవుల్లోనేనా... అన్న చర్చ మాత్రం విపక్షాల నుంచి నడుస్తోంది. ఈ సామాజిక తరగతులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి. ఈ తరగతులు విద్య, ఆర్థికం ఎదగటానికి గతంలోనున్న అనేక పథకాలు ఈ నాలుగన్నరేళ్ల కాలంలో అమలుకు నోచుకోలేదు. మరోవైపు దళితులపై దాడులు జరిగిన ఘటనలు అనేకమున్నాయి. వివక్ష పెద్దఎత్తున కొనసాగుతూనే ఉంది. వీటి నిర్మూలనకు తీసుకున్న చర్యలేవి కనిపించటం లేదు. ఇటువంటి చర్యలేవి తీసుకోకుండా సామాజిక మద్దతు కూడగట్టడం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు సామాజిక సంఘాల నుంచి వ్యక్తమవుతోంది. కేవలం రాజకీయ పదవులు, అది కూడా నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించినంత మాత్రాన సామాజిక సాధికారత సాధ్యమవుతుందా అన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. వీటిని వైసిపి ఈ యాత్ర ద్వారా ఏ మేరకు నివృత్తి చేయగలదో చూడాల్సి ఉంది.