Dec 16,2022 22:23

ప్రజాశక్తి - భీమడోలు
                  మండల పరిధిలోని 10 రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 17వ తేదీ నుంచి వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో సమస్యల గుర్తింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ షంషుద్దీన్‌ తెలిపారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ (ఎఫ్‌-పిఒఎల్‌ఆర్‌) కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి నియమితులైన కోర్‌ కమిటీ సభ్యులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం స్థానికంగా నిర్వహించారు. షంషుద్దీన్‌ మాట్లాడుతూ విఆర్‌ఒ ఆధ్వర్యంలో ఇతర శాఖలకు చెందిన అయిదు లేదా ఆరుగురు సిబ్బంది గ్రామ కోర్‌ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారన్నారు. డ్రోన్‌ ఆధారంగా భూముల విస్తీర్ణం ఖరారు చేస్తారన్నారు. క్షేత్రస్థాయిలో ఆ మేరకు పరిశీలనా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి ముందు క్షేత్రస్థాయిలో రైతులు, ఇతరులు లేవనెత్తే సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కోర్‌ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఆ తర్వాతే రీసర్వే చేపడతారని తెలిపారు. ఏలూరు రెవెన్యూ డివిజన్‌లో పైలెట్‌ గ్రామంగా ఎంపికైన కోడూరుపాడు రెవెన్యూ గ్రామంలో రీసర్వే కార్యక్రమం ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. పలువురు గ్రామ రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ సర్వే కార్యక్రమం పేర ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. దీనిపై స్పందించిన అధికారులు సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపిడిఒ రాఘవన్‌, మండల సర్వేయర్‌ ధర్మారావు, ఆర్‌ఐ కిరణ్‌కుమారి, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం మండల అధ్యక్షులు కెడివి.ప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.