Nov 07,2023 01:34

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రాజకీయ ప్రచార జాతా మంగళవారం నుంచి మూడ్రోజులపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరగనుంది. అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఈ ప్రజారక్షణ భేరిని చేపట్టింది.
కేంద్రంలో బిజెపి ప్రజావ్యతిరేక, మతోన్మాద విధానాలు అవలంబిస్తున్నా ఆ పార్టీకే రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన అంటకాగుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత అమలు కావాల్సిన విభజన చట్టం హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌, కడప ఉక్కు, రామాయపట్నం పోర్టు అభివృద్ది, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో బిజెపి నాయకత్వం రాష్ట్రానికి మొండి చేయిచూపినా మూడు ప్రధాన పార్టీలు ప్రశ్నించడం లేదు. రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల భారం, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు, పంటలకుమద్దతు ధరలు లేకపోవడం, నిత్యావసర వస్తువులధరలు భారీగా పెరగడం, పేద కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో పాలకులు, ప్రధాన పార్టీలు స్పందించకపోవడాన్ని ఎండగడుతూ ప్రజా సమస్యలపై సిపిఎం చేపట్టిన ఈ యాత్ర కర్నూలు జిల్లా ఆదోని నుంచి గతనెల 30న ప్రారంభమైంది. జాతాకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్‌ నాయకత్వం వహిస్తున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, నాయకులు ప్రభాకరరెడ్డి, కె.ఉమామహేశ్వరరావు, రాంభూపాల్‌, దయా రమాదేవి, శివనాగరాణి, భాస్కరయ్య తదితరులు భాగస్వామ్యం అవుతున్నారు.
ఈ యాత్ర ఈనెల 7వ తేదీన మంగళవారం బాపట్ల జిల్లా అద్దంకి నుంచి పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటకు చేరుకుంటుంది. నర్సరావుపేటలో స్థానిక ప్రజలను కలిసి అనంతరం బహిరంగ సభలో నాయకులు మాట్లాడతారు. సాయంత్రం 6గంటలకు సత్తెనపల్లి చేరుకుంటారు. సత్తెనపల్లిలో బహిరంగ సభ తర్వాత చిలకలూరిపేట వెళ్తారు. 8వ తేదీ ఉదయం చిలకలూరిపేటలో స్థానిక ప్రజలను కలుస్తారు. కళామందిర్‌ సెంటర్‌లో జరిగే సభ అనంతరం బాపట్ల జిల్లా పర్చూరు, చీరాల, బాపట్ల, వెల్లటూరులో జాతా పర్యటిస్తుంది. 9వ తేదీ గురువారం ఉదయం జాతా గుంటూరు జిల్లా తెనాలి చేరుకుంటుంది. తెనాలిలో ఉదయం 9 గంటలకు అన్నాబత్తుని పురవేదిక వద్ద సభ అనంతరం 11 గంటలకు గుంటూరు, 3 గంటలకు పెదకాకాని, సాయంత్రం 4 గంటలకు మంగళగిరి మండలం కాజ, సాయంత్రం 5 గంటలకు మంగళగరి, ఆరు గంటలకు తాడేపల్లిలో బహిరంగ సభతో జాతా ముగుస్తుంది.
కరువు తీవ్రంగా ఉన్నా స్పందన శూన్యం
గుంటూరు విజరుకుమార్‌, సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి

పల్నాడు జిల్లాలో కరువు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వ స్పందన శూన్యం. సాగర్‌ ఆయకట్టులో ఈ ఏడాది ఖరీఫ్‌లో 60 శాతం భూమి సాగవ్వకున్నా ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు. మిర్చి పంటకు బొబ్బర, తామర తెగులు వస్తున్నా గత ఐదేళ్ల కాలంలో తెగుళ్లను తట్టుకునే వంగడాలను రూపొదించడంలో ప్రభుత్వం దృష్టి సారించలేదు. వ్యవసాయ పనుల్లేక కూలీలు ఇతర ప్రాంతాలకు వలసెళ్తున్నారు. వైద్యరంగాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామని సిఎం జగన్‌ చెబుతున్నా పల్నాడు జిల్లాలో ఏ ఆస్పత్రిలో కనీసం కాన్పులు చేయలేని దుస్థితి నెలకొంది. చాలా ఆస్పత్రులు వైద్యులు, సిబ్బంది ఉండటం లేదు. కనీస సదుపాయాలు లేవు. ఇటీవల కారంపూడి నుంచి గురజాల, నర్సరావుపేటకు గర్భిణిని తిప్పిన ఘటన ఇందుకు ఉదాహరణ. సిఎం జగన్‌ ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీలు ఇంత వరకు నెరవేరలేదు. వరికపూడిశెల ప్రాజెక్టు, పేరేచర్ల-కొండమోడు రహదారి విస్తరణ, అభివృద్ధి, పల్నాడు జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు ఇచ్చిన హామీలను పట్టించుకోలేదు.
పాదయాత్ర హామీలు పట్టించుకోవడం లేదు
పాశం రామారావు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి.

సిఎం జగన్‌ జిల్లాలో 2018లో నిర్వహించిన పాదయాత్రలో ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదు. మూడు రాజధానుల ప్రతిపాదన వల్ల జిల్లా వాసులకు, రాజధాని రైతులకు తీవ్ర నష్టం జరిగింది. నల్లమడ డ్రెయిన్‌ వల్ల మురుగు సమస్య, గుంటూరు ఛానల్‌ విస్తరణ, పొడిగింపు పనులు, గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాలకు రోడ్లు అభివృద్ధి, గురటూరులో అభివృద్ధి పనులకు సంబంధించిన జగన్‌ ఇచ్చిన హామీలు ఆరేళ్లయినా నెరేవేరలేదు. డెల్టాలో హైలెవల్‌ ఛానల్‌ పనులు పూర్తి చేసి ఉంటే 25 వేల ఎకరాలకు నీరు అందేది. గుంటూరు ఛానల్‌ పనులు పూర్తి చేసే ఉంటే 50 వేల ఎకరాల్లో సాగు నీటికి ఇబ్బంది లేకుండా ఉండేది. 50 గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేది. గుంటూరులో జ్యూట్‌ మిల్లు తెరిపిస్తామని జగన్‌ ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదు. ఐదు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డా పట్టించుకోలేదు. అసంఘటి రంగ కార్మికులకు, స్కీం వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న రాజకీయ జాతాను ప్రజలు జయప్రదం చేయాలి.